నియంతలతో ఎలా డీల్ చేయాలో అమెరికాకు తెలుసు

నియంతలతో ఎలా డీల్ చేయాలో అమెరికాకు తెలుసు
  • ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ కామెంట్
  • పుతిన్​కూ మదురో గతే పడుతుందని పరోక్షంగా వ్యాఖ్య

కీవ్: నియంతలతో ఎలా డీల్  చేయాలో అమెరికాకు బాగా తెలుసని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ అన్నారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్  మదురో అరెస్టుపై స్పందిస్తూ ఆయన ఈ కామెంట్లు చేశారు. యూరోపియన్  నేషనల్  సెక్యూరిటీ సలహాదారులతో జెలెన్ స్కీ ఆదివారం భేటీ అయ్యారు. వెనెజువెలాపై అమెరికా నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్ పై స్పందించాలని యూరోపియన్  నేషనల్  సెక్యూరిటీ సలహాదారులు ఈ సందర్భంగా జెలెన్ స్కీని అడిగారు.

ఆయన జవాబు ఇస్తూ.. ‘‘మీ ప్రశ్నకు నేనెలా రియాక్ట్  అవ్వాలి? ఏమని జవాబు చెప్పగలను? నియంతలతో అలాగే డీల్  చేయాల్సి వస్తే, నెక్స్ట్ ఏం చేయాలో యూఎస్ కు బాగా తెలుసు” అని వ్యాఖ్యానించారు. రష్యానుగానీ, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్  పుతిన్ పేరునుగానీ ప్రస్తావించకుండా జెలెన్ స్కీ పరోక్షంగా వ్యాఖ్యలు చేసినా.. పుతిన్ ను ఉద్దేశించే ఆయన అలా సమాధానం చెప్పారని తెలుస్తోంది. మదురోను బంధించినట్లే పుతిన్ ను కూడా బంధించాలని యూఎస్  ప్రెసిడెంట్  డొనాల్డ్  ట్రంప్ కు ఇండైరెక్ట్ గా ఆయన సూచించారు.

కాగా.. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసింది. దాంతో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ కు భారీగా ఆస్తి, ప్రాణనష్టం కలిగింది. ఇరు దేశాల మధ్య ఒకవైపు శాంతి చర్చల కోసం తాను ప్రయత్నిస్తున్నా.. మరోవైపు రష్యా తమ దేశంపై దాడులు చేస్తూనే ఉందని జెలెన్ స్కీ పలుమార్లు ఆరోపించారు. పుతిన్​ టెర్రరిస్టు అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలోనే మదురోను అమెరికా పట్టుకున్నట్లే పుతిన్​ను కూడా పట్టుకుంటే బాగుంటుందని అర్థం వచ్చేలా కామెంట్లు చేశారు.