షాకింగ్.. కస్టమర్‌పై Zepto డెలివరీ బాయ్ దాడి.. చిన్న పొరపాటుతో పిడిగుద్దుల వర్షం

షాకింగ్.. కస్టమర్‌పై Zepto డెలివరీ బాయ్ దాడి.. చిన్న పొరపాటుతో పిడిగుద్దుల వర్షం

Zepto News: ప్రస్తుతం నిమిషాల్లో కిరాణా సరుకుల డెలివరీ వ్యాపారంలో వేగంగా వృద్ధి చెందుతున్న జెప్టో చిక్కుల్లో కొనసాగుతోంది. ఒకపక్క సప్లై, స్టాఫింగ్ వంటి కారణాలతో 44 ప్రాంతాల్లో జెప్టో కేఫ్ తన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సంస్థ పేరు ప్రధానంగా వార్తల్లో నిలిచింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు బసవేశ్వర నగర్, జడ్జీల కాలనీలో సరుకులు డెలివరీ ఇవ్వటానికి వెళ్లిన జెప్టో డెలివరీ బాయ్ వీరంగం సృష్టించాడు. ఒక వ్యాపారి శషాంక్ పై డెలివరీ ఏజెంట్ చేసిన దాడితో తలకు గాయాలు అయ్యాయి. మూడు రోజుల కిందట జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ డెలివరీ ఏజెంట్ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

వాస్తవానికి డెలివరీ ఏజెంట్ నుంచి సరకులు తీసుకునేందుకు వ్యాపారి వదిన వెళ్లింది. అయితే డెలివరీకి సంబంధించిన అడ్రస్ పొరపాటు దొర్లటంపై వివాదం మెుదలైంది. డెలివరీ ఏజెంట్ బూతులు తిట్టగా గొడవ పెద్దదౌతుండటంతో సదరు వ్యాపారి దానిని ఆపేందుకు అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో టెంపర్ కోల్పోయిన డెలివరీ బాయ్ శశాంక్ పై దాడి చేయటం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీనిపై వారు కంపెనీ కస్టమర్ కేర్ ను సంప్రదించగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని.. జరిగిన ఘటనకు చింతిస్తున్నట్లు జెప్టో కస్టమర్ సపోర్ట్ స్పందించింది. 

దాడి సమయంలో శశాంక్ ముఖం, తల, దవడ, కన్ను భాగాల్లో డెలివరీ ఏజెంట్ పిడిగుద్దులు గుద్దటంతో తలకు ఫ్రాక్చర్ అయ్యింది. గాయాలు వారంలో మానకపోతే తలకు సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారని శశాంక్ పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పైగా డెలివరీ బాయ్ విష్ణువర్థన్ తనను చంపేస్తానని కూడా బెదిరించాడని శశాంక్ పేర్కొన్నాడు.