పేలని ఎలక్ట్రిక్ బ్యాటరీ తెచ్చిన్రు

పేలని ఎలక్ట్రిక్ బ్యాటరీ తెచ్చిన్రు

ఎలక్ట్రిక్ బండ్లు, ఇతర గాడ్జెట్లలో ఉపయోగించే లిథియం బ్యాటరీల్లో చాలావరకు  చైనా నుంచి  తెప్పించినవే.  ఈమధ్య లిథియం బ్యాటరీలు పేలి ప్రమాదాలు జరగడం, ఒకరిద్దరు చనిపోవడం చూశాక పేలని ఎలక్ట్రిక్ బ్యాటరీలు తయారుచేయాలి అనుకున్నాడు ఐఐటీ–మద్రాస్​లో  కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్​మెంట్​లో అసిస్టెంట్ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న అరవింద్ కుమార్. ఆయన తన టీంతో కలిసి లిథియం  జింక్–ఎయిర్​ బ్యాటరీల మీద రీసెర్చ్​ చేశారు. వీళ్లు ఈ మధ్యే జింక్–ఎయిర్ బ్యాటరీలు  తయారుచేశారు.  

ఈ బ్యాటరీ ఇన్నొవేషన్ గురించి  అరవింద్​ మాట్లాడుతూ... ‘‘లిథియం అయాన్ బ్యాటరీలతో పోల్చితే జింక్–ఎయిర్ బ్యాటరీలు పర్యావరణానికి హాని చేయవు. కాకపోతే ఈ రెండూ ఒకేలా మైలేజ్ ఇస్తాయి. పైగా జింక్– ఎయిర్ బ్యాటరీలను తయారు చేయడం, ఉపయోగించడం చాలా ఈజీ. జింక్ అనేది ఒక మూలకం.  ఫుడ్​లో ఉంటుంది. ఇది  లిథియం కంటే చాలా సేఫ్​. జింక్– ఎయిర్ బ్యాటరీలో  జింక్ ఎలక్ట్రోడ్,  ఆక్సిజన్ (గాలి నుంచి సేకరించినది) ఎలక్ట్రోడ్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్ లిక్విడ్​​ (ఉప్పు, నీళ్ల మిశ్రమం)లో ఈ రెండు ఎలక్ట్రోడ్​లు  మునిగి ఉంటాయి.  అవి నీళ్లలో ఉండడం వల్ల బ్యాటరీ పేలే అవకాశం ఉండదు. ఒకవేళ బ్యాటరీ తయారు చేసేటప్పుడు  ఏదైనా పొరపాటు జరిగితే బ్యాటరీ పనిచేయదు” అని చెప్పాడు. 

మెమరీ కార్డ్ మార్చినట్టు...

లిథియం– అయాన్ బ్యాటరీ మార్చాల్సి వచ్చినప్పుడు పూర్తిగా ఛార్జింగ్ ఉన్న బ్యాటరీ పెడతారు.  అదే జింక్–ఎయిర్ బ్యాటరీ అయితే... పాత బ్యాటరీ తీసేసి కొత్తది పెట్టాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీని ఛార్జ్​ చేయడం ఒక గాడ్జెట్ నుంచి మెమరీ కార్డు తీసి, మరొక మెమరీ కార్డు పెట్టినంత ఈజీ. అదెలాగంటే... ఆ బ్యాటరీలోని  జింక్ క్యాసెట్​(ఆనోడ్​)ని మారిస్తే సరిపోతుంది. అందుకోసం ఈవీ ఛార్జింగ్ స్టేషన్​ లేదంటే జింక్ క్యాసెట్ రీప్లేస్​మెంట్ సెంటర్ల దగ్గరకు వెళ్లాలి. ట్రైనింగ్ తీసుకుంటే ఇంటి దగ్గర కూడా జింక్ క్యాసెట్​ని మార్చొచ్చు. అంతేకాదు పాత జింక్ క్యాసెట్లని  రీసైకిల్​ చేయొచ్చు. వాటిలోని జింక్​ ఆక్సైడ్​ని మళ్లీ జింక్​గా మార్చొచ్చు. 

‘అయితే.. ఈ బ్యాటరీల పనితీరు, నాణ్యత గురించి మరింత రీసెర్చ్​ చేయాలి. ఈ కొత్తరకం బ్యాటరీలను ఎక్కువగా తయారుచేసేందుకు ఆటోమొబైల్ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. చాలావరకు ఎలక్ట్రిక్ స్కూటర్లలో 2కిలోవాట్ బ్యాట రీలు ఉంటాయి.  జింక్– ఎయిర్ బ్యాటరీల్లో 1.3 నుంచి 2.6 కిలోవాట్ అవర్​ ఎనర్జీ ఉంటుంది’ అంటున్నాడు ఈ టీంలోని చంద్రన్​​​.