జొమాటో యాప్ ద్వారా పెరుగుతున్న బిర్యానీ ఆర్డర్లు

జొమాటో  యాప్ ద్వారా పెరుగుతున్న బిర్యానీ ఆర్డర్లు

పొడవైన బాస్మతి రైస్. మెత్తటి చికెన్. ఘుమాయించి కొట్టే మసాలాల సువాసన. రెస్టారెంట్ వైపు వెళ్తే చాలు పద పదా అంటూ మనసు లాగేస్తుంది. ఘుమఘుమలాడే మన హైదరాబాదీ బిర్యానీ పవర్ అది. అందుకే అందరికీ ఫేవరేట్. లంచైనా, డిన్నరైనా, మిడ్ నైట్ ఫుడ్ అయినా బిర్యానీకే సలాం బిర్యానీనే కావాలంటారు యూత్. హైదరాబాద్ లోని పాపులర్ బిర్యానీ రెస్టారెంట్లకు వెళితే రెడ్, బ్లాక్ టీ షర్స్ట్ వేసుకుని ఓ ఆర్మీ కనిపిస్తుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బావర్చి రెస్టారెంట్ లో ఆర్డర్ తీసుకోవడానికి పెద్ద క్యూలో వేచి చూస్తున్న డెలివరీ బాయ్స్ ఫొటోను జొమాటో  ట్వీట్ చేసింది. బావర్చి బిర్యానీ కోసం హైదరాబాద్ లో జొమాటో ద్వారా రోజూ 2 వేల ఆర్డర్లు వస్తున్నా యని చెప్పింది.

మధ్యాహ్న సమయంలో ఆర్డర్లు పీక్స్ కు చేరడంతోనే డెలివరీ ఆర్మీ క్యూ పెరిగిందని తెలిపింది. పైన చూపిన ఫొటో అదే. బుధవారం తీశారు. తమిళనాడులోని మధురైలో కూడా చికెన్ బిర్యానీ గురించే ఎక్కువ మంది జొమాటోలో వెతికారని తన వార్షిక రిపోర్టులో వెల్లడించింది. 1.50 లక్షల మంది ఉండే ఓ చిన్న పట్టణంపై యాప్ సర్వీసుల్ని లాంచ్ చేయగా మంచి ఫలితాలు వచ్చాయని జొమాటో తన రిపోర్టులో చెప్పుకొచ్చింది. అందుకే 1000 చిన్న పట్టణాల్లో అతి త్వరలో సర్వీసులు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. ఊటీలో సగటున ఎక్కువ ధరతో ట్రాన్సా క్షన్లు జరిపినట్లు జొమాటో వివరించింది.

లక్నోలో ఓ యూజర్ అత్యధికంగా 16,800 రూపాయలకు ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లోని తుని పట్టణం అత్యధికంగా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లు జరిపినట్లు జొమాటో తెలిపింది. విజయవాడ నుంచి అత్యధికంగా బ్రేక్ ఫాస్ట్ కోసం ఆర్డర్లు జరిగాయని వివరించింది. ఇండోర్ జనం ఎక్కువగా మిడ్ నైట్ డెలివరీలు కోరుతున్నా యని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 10 వేల నగరాల్లో జొమాటో సర్వీసులు అందిస్తోంది. 14 లక్షల రెస్టారెంట్లు ఈ యాప్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.