డెలివరీబాయ్‌లకు కమీషన్‌ రూ.10 కట్‌

డెలివరీబాయ్‌లకు కమీషన్‌ రూ.10 కట్‌

జొమాటో ప్రకటన

ముంబై: వేలాది మంది డెలివరీబాయ్‌‌లకు జొమాటో చేదు కబురు చెప్పింది. జీతాలను సరిగ్గా చెల్లించడం లేదని, రేట్‌‌కార్డులను మార్చారని ఇది వరకే ముంబై, బెంగళూరులో డెలివరీబాయ్‌‌లు ఆందోళన చేస్తుండగా, వారి కమీషన్‌‌ను తగ్గిస్తున్నట్టు ఈ స్టార్టప్‌‌ మంగళవారం ప్రకటించింది. ఇక నుంచి దీనిని రూ.40 నుంచి రూ.30లకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. డెలివరీ సగటు సమయం తగ్గడం, సామర్థ్యం పెరగడం వల్ల గతం కంటే ఇప్పుడు డెలివరీబాయ్‌‌లు ఎక్కువ ఆర్డర్లను కస్టమర్లకు అందించగలుగుతారని, వారి ఆదాయం యథాతథంగా ఉంటుందని జొమాటో అంటోంది. ఈ విషయంలో డెలివరీబాయ్‌‌ల వాదన మాత్రం వేరేలా ఉంది. కమీషన్లను తగ్గించడమేగాక, డెలివరీ దూరాలను పెంచారని ఆక్షేపించారు. ఎక్కువ దూరం ప్రయాణిస్తేనే బోనస్‌‌ పాయింట్లు వస్తున్నాయని తెలిపారు.
ఇదిలా ఉంటే, జొమాటో అమలు చేస్తున్న ఫైన్‌‌ డైనింగ్ గోల్డ్‌‌ ప్రోగ్రామ్‌‌ను నేషనల్‌‌ రెస్టారెంట్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్ ఇండియా (ఎన్‌‌ఆర్‌‌ఏఐ) తప్పుబట్టింది. ఈ పథకంలో భారీ డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల తమకు నష్టం కలుగుతున్నదని పేర్కొంటూ పలు రెస్టారెంట్లు దీని నుంచి బయటికి వచ్చాయి. జొమాటో లాంటి ప్లాట్‌‌ఫామ్స్‌‌ ఆఫర్ చేసే డిస్కౌంట్లపైనే కాకుండా.. అవి చేజిక్కించుకుంటున్న డేటాపై కూడా రెస్టారెంట్ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిగ్ డేటాను వాడుతూ.. కస్టమర్లు ఎక్కువగా  ఏ రకమైన ఫుడ్‌‌ను కొంటున్నారు? ఏ ప్రాంతంలో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయో తెలుసుకుని.. క్లౌడ్ కిచెన్లను  ఏర్పాటు చేస్తున్నాయని రెస్టారెంట్లు ఆరోపిస్తున్నారు.  సొంత కిచెన్లను ఏర్పాటు చేసి, పిజ్జా కోసం సెర్చ్ చేసే కస్టమర్లను తమ కిచెన్లవైపు దారి మళ్లిస్తున్నారని చెప్పారు. ఫుడ్ ప్లాట్‌‌ఫామ్‌‌లు చేస్తోన్న ఈ పనులు ఆందోళనకరంగా ఉన్నాయని రెస్టారెంట్ యజమానులు చెబుతున్నారు.

జొమాటో మాజీలకు మెడికాబజార్‌‌లో ఉద్యోగాలు

జొమాటో ఇటీవల తొలగించిన వారిలో 200 మందికి ఉద్యోగాలు ఇస్తామని ఆన్‌‌లైన్‌‌ బీ2బీ కంపెనీ మెడికాబజార్‌‌ ప్రకటించింది. వీరందరినీ కస్టమర్‌‌ కేర్‌‌ సేవల కోసం ఉపయోగించుకుంటామని తెలిపింది. త్వరలోనే ఇంటర్వ్యూలు మొదలవుతాయని వెల్లడించారు.   గురుగ్రామ్‌‌లోని కంపెనీ హెడ్‌‌ ఆఫీస్‌‌లో పనిచేసే 540 మంది ఉద్యోగులను జొమాటో ఈ నెల ఏడున తొలగించింది.   కస్టమర్‌‌ సర్వీస్‌‌ అవసరం తగ్గడం వల్ల, రోబోట్స్‌‌, ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించడం వల్ల కొంతమందిని తీసేసిన మాట నిజమేనని, అయితే గతంలోకంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని కంపెనీ సీనియర్ ఆఫీసర్‌‌ ఒకరు అన్నారు. టెక్నాలజీ, ప్రొడక్ట్‌‌, డేటా సైన్సెస్‌‌ టీమ్స్‌‌ కోసం ఇప్పటికీ నియామకాలు కొనసాగుతున్నాయని, గత ఐదేళ్లలో తమ వ్యాపారం పదిరెట్లు పెరగడం వల్ల వేలాది మందికి ఉపాధి కల్పించడం సాధ్యపడిందని చెప్పారు. 2008లో మొదలైన జొమాటో ఇప్పుడు 24 దేశాల్లోని పది వేల నగరాల్లో ఫుడ్‌‌ డెలివరీ సేవలు అందిస్తోంది. మనదేశంలోని 500 నగరాల్లో 2.5 కోట్ల మందికి ఆహారం డెలివరీ చేస్తోంది. ఎనలిస్టుల అంచనాల ప్రకారం జొమాటో వాల్యుయేషన్‌‌ 3.6 –4.5 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది.