సైకిల్‌పై ఫుడ్ డెలివరీ.. బైక్ కొనిచ్చిన నెటిజన్స్

సైకిల్‌పై ఫుడ్ డెలివరీ.. బైక్ కొనిచ్చిన నెటిజన్స్

హృదయాన్ని కదిలించే కథల గురించి అరుదుగా వింటూ ఉంటాం. అలాంటి ఓ చిన్న కథే హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అకీల్ అహ్మద్‌ది. ఇంజినీరింగ్ విద్యార్థి అయిన అకీల్.. జొమాటోలో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. దీని ద్వారా వచ్చిన డబ్బులతోనే పూట గడుపుతున్నాడు. ఇకపోతే, ఫుడ్ డెలివరీలు వేగంగా చేయాలనే విషయం తెలిసిందే. బైక్ లేదా స్కూటీలపై డెలివరీ చేసే ఏజెంట్లను చూసే ఉంటాం. అయితే బైక్ కొనేంత డబ్బులు లేకపోవడంతో అకీల్ సైకిల్ మీద డెలివరీలు చేస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్‌గా కింగ్ కోఠిలో ఉండే రాబిన్ ముఖేశ్ ఓ చాయ్‌ను ఆర్డర్ ఇచ్చాడు. ఈ ఆర్డర్‌ను అందుకున్న అకీల్.. సైకిల్ మీద 20 నిమిషాల్లో 9 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ముఖేశ్‌కు డెలివరీని అందించాడు. 

సైకిల్ మీద అకీల్ ఫుడ్ డెలివరీ చేయడం చూసిన ముఖేశ్.. అతడి ఆర్థిక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాడు. అకీల్ గురించి ఓ కథనం రాసి దాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. అకీల్‌ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అని, అతడ్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని నెటిజన్స్‌ను కోరాడు ముఖేశ్. అకీల్ డెలివరీ అందుకున్న వారు అతడికి టిప్స్ రూపంలో సాయం చేయొచ్చని రాసుకొచ్చాడు. గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్ క్లబ్ అనే ప్రైవేట్ గ్రూప్‌లో సభ్యుడైన ముఖేశ్.. అకీల్‌కు సాయం అందించాలని ఆ గ్రూప్ సభ్యులను విజ్ఞప్తి చేశాడు. అలాగే నెటిజన్స్‌‌ను సాయం అడుగుతూ ఫండ్ రైజింగ్‌‌ను ఏర్పాటు చేశాడు. దీనికి విశేషమైన స్పందన వచ్చింది. అకీల్ కథ గురించి తెలుసుకున్న నెటిజన్స్.. అతడికి సాయమందించేందుకు ముందుకొచ్చారు. దీంతో కేవలం 10 గంటల్లో రూ.60 వేలు జమయ్యాయి. ఈ డబ్బులకు ఫండ్ రైజింగ్ మనీని కలపగా మొత్తంగా రూ.73,370 అయ్యాయి. గ్రూప్ మెంబర్స్‌తోపాటు నెటిజన్స్ సాయంతో కూడగట్టిన డబ్బులతో అకీల్‌కు రూ.65 వేల ధర కలిగిన టీవీఎస్ ఎక్స్‌‌ఎల్ బైక్ కొనిచ్చామని ముఖేశ్ తెలిపాడు. మిగిలిన డబ్బులతో అకీల్ కాలేజీ ఫీజు చెల్లిస్తామని చెప్పాడు. అకీల్ పేరిట చేసిన ఫండ్ రైజింగ్‌ను ఆపేశామని పేర్కొన్నాడు.