జోనల్ కమిషనర్లకుహెచ్ సిటీ పనుల బాధ్యతలు .. GHMC కమిషనర్ కర్ణన్ నిర్ణయం

జోనల్ కమిషనర్లకుహెచ్ సిటీ పనుల బాధ్యతలు .. GHMC కమిషనర్ కర్ణన్ నిర్ణయం
  • నెమ్మదిగా నడుస్తున్న వర్క్స్​
  • పట్టించుకోని ప్రాజెక్టు విభాగం అధికారులు  
  • స్పీడప్ అయ్యేలా చూడాలని జడ్సీలకు ఆదేశాలు 

హైదరాబాద్ సిటీ, వెలుగు :జీహెచ్ఎంసీ ప్రాజెక్టుల బాధ్యతలను జోనల్ కమిషనర్లకు అప్పగించారు. ప్రాజెక్టు పనులకు సంబంధించిన వ్యవహారాలను ప్రాజెక్ట్ విభాగం అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే కమిషనర్​ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన హెచ్ సిటీ పనుల్లో పురోగతి కనిపించడంలేదు. సీఎం డ్రీమ్ ప్రాజెక్టు అయిన కేబీఆర్ పార్కు దగ్గర పనులతో పాటు మరిన్ని వర్క్స్​నత్తకు నడకలు నేర్పుతున్నాయి. 

హెచ్​సిటీ కిందనే 38 పనులు 

హెచ్ సిటీ కింద రూ.7,032  కోట్లతో 25 పనులు చేపట్టగా ఇందులో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్వోబీలున్నాయి. మరో13 పనులు రోడ్డు విస్తరణకు సంబంధించినవి. ఈ సనులకి నిధుల కొరత లేదు. ఎంత స్పీడ్ గా పనులు చేపట్టాలనేది ప్రాజెక్టు విభాగం అధికారులపైనే ఉంది. అయితే ప్రాజెక్టు విభాగానికి సంబంధించిన చీఫ్ ఇంజినీర్ భాస్కర్ రెడ్డి పెద్దగా పట్టించుకోకపోవడంతోనే పనులు ముందుకుసాగడంలేదని ఆ విభాగంలోనే కొందరు ఆరోపిస్తున్నారు. 

ఇటీవల ఇదే అంశంపై కమిషర్ కర్ణన్​సైతం సమావేశం నిర్వహించి పనులు ఎందుకు స్పీడ్​గా జరగడం లేదని ప్రశ్నించారు. ఇలాగే వదిలేస్తే లాభం లేదని, ఇకపై జోనల్ కమిషనర్లు తమ తమ పరిధిలోని ప్రాజెక్టులపై ప్రాజెక్టు అధికారులతో సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులు స్పీడప్ అయ్యేలా చూడాలని, అలాగే పనుల పురోగతిపై తనకు సమాచారం ఇవ్వాలని కోరారు.