అర్థగంటల 1300మంది ఉద్యోగులను తీసేసిన్రు

అర్థగంటల  1300మంది ఉద్యోగులను తీసేసిన్రు

ఆర్ధిక మాంద్యం కారణంగా  పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల్లో కోత పెడుతున్నాయి. నిర్దాక్షణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా లేఆఫ్స్ కంపెనీల జాబితాలోకి జూమ్ సంస్థ చేరింది. తమ కంపెనీలో 15 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈవో ఎరిక్ యువాన్ వెల్లడించారు. కొవిడ్ సమయంలో భారీగా సేవలు అందించాల్సిన కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నామని..ఇప్పుడు ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించక తప్పని పరిస్థితి నెలకొందని తెలిపారు. 

గతంలో ఐటీ డిమాండ్ కారణంగా జులై 2019 నుంచి అక్టోబర్ 2022 మధ్యలో జూమ్ సంస్థ 272 శాతం ఎక్కువగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. అంటే దాదాపు 8,422 మందిని తీసుకుంది. దీంతో కంపెనీపై భారం పడిందని..దిద్దుబాటు చర్యలు భాగంగా ప్రస్తుతం 1300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈవో ఎరిక్ యువాన్ తెలిపారు. అమెరికాలోని తమ సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని చేరవేయనున్నట్లు యువాన్ చెప్పారు. అరగంటలో ఇంపాక్టడ్ అని మెయిల్ వస్తుందన్నారు. అమెరికా బయట ఉన్న ఉద్యోగులకు స్థానిక విధానాలను బట్టి సమాచారం చేరవేస్తామన్నారు. అయితే అమెరికాలో ఉద్యోగం కోల్పోనున్న జూమీల‌కు 16 నెల‌ల జీతం ఇవ్వనున్నట్లు యువాన్ వెల్లడించారు. అలాగే  హెల్త్‌కేర్ క‌వ‌రేజ్ కూడా ఉంటుందన్నారు.  2023 ఏడాదికి  చెందిన బోన‌స్ కూడా ఇస్తామన్నారు. ఇతర దేశాల్లో  స్థానిక చ‌ట్టాల‌ను బ‌ట్టి ఉద్యోగుల తొలగింపు  ప్రక్రియ జ‌రుగుతుంద‌న్నారు. 

జీతంలో 98 శాతం కోత

వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన వేతనంలో ఏకంగా 98 శాతం కోత విధించుకున్నట్లు ఎరిక్ యువాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితికి జవాబుదారీగా  ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. 2023లో కార్పొరేట్ బోనస్‌ను కూడా వదులుకుంటున్నానని తెలిపారు. తనతో పాటు.. ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్‌ టీమ్ కూడా తమ కనీస వేతనాలను 20 శాతం మేర కోత విధించుకుంటున్నాయని వెల్లడించారు.