సత్తుపల్లి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వం నిర్లక్ష్యంతోనే బీఆర్ఎస్ ఓటమిపాలైందని జడ్పీటీసీ కూసంపుడి రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ సత్తుపల్లి పట్టణ, మండల ముఖ్య నాయకులతో శుక్రవారం లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాన్ని పట్టణంలో నిర్వహించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను విస్మరించి, ఎన్నికల ముందు పార్టీ సమావేశాలు పెట్టడంతో ఉపయోగం ఉండదని రామారావు అసహనం వ్యక్తం చేశారు.
మండల పార్టీ అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నడు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకుండా, కమిటీలు ఏర్పాటు చేయకుండా కాలం వెళ్లదీసి, కార్యకర్తలను ఆగం చేశారంటూ నిప్పులు చెరిగారు. కిష్టాపురం గ్రామానికి చెందిన మరో సీనియర్ నాయకుడు మాదిరాజు శర్మ మాట్లాడుతూ కార్యకర్తలను పార్టీ నాయకత్వం విస్మరించిందన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని ఎంపీపీ దొడ్డ హైమావతిని మాజీ ఎమ్మెల్యే సండ్ర కోరగా ఆమె తిరస్కరించింది.
ఇందుకు సమాధానంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ పేరుకే తాను జిల్లా పార్టీ అధ్యక్షుడనని, కాళ్లు చేతులు ఉండి, నాయకత్వం ఎవరూ సహకరించకపోవడంతోనే పార్టీ నిర్మాణం చేయలేకపోయానని ఒప్పుకున్నారు. జిల్లాలో మంత్రి సహా ఎవరూ తనకు సహకరించలేదని వాపోయారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత పాలన చేస్తోందన్నారు.
అమలు సాధ్యం కానీ కాంగ్రెస్ హామీలతో పాటు పదేండ్ల బీఆర్ఎస్ సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ సీనియర్ పార్లమెంట్ సభ్యుడిగా లక్ష ఓట్ల మెజార్టీతో నామాను ప్రజలు గెలిపించనున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ తనకు మైనస్ వచ్చిన బూత్ లలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, మాజీ చైర్మన్ శీలపు రెడ్డి హరికృష్ణ రెడ్డి, నాయకులు రఫీ, అంకమ రాజు, మాధురి మధు, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.