తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలం దాటిన వేళ, అభివృద్ధి ప్రయాణంతో పాటు పరిపాలనా వ్యవస్థ పనితీరుపై సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. మౌలిక వసతులు, సంక్షేమ పథకాల విస్తరణలో రాష్ట్రం ముందడుగు వేసినా, ప్రజలకు అందే సేవల నాణ్యతపై ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అంశం మరోసారి చర్చకు వస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కోసం పనిచేయడం అంటే బాధ్యత. పరిపాలనకు హృదయం ఉద్యోగులే.
ప్రజల అవసరాలు, ప్రభుత్వ విధానాలు మధ్య ఉద్యోగులే వారధి. ఈ వారధి బలంగా ఉంటేనే ప్రజల నమ్మకం నిలుస్తుంది. లేదంటే అభివృద్ధి గణాంకాలు ఎలా ఉన్నా, ప్రజలకు ప్రభుత్వ పథకాలు సరిగా చేరకపోతే చేస్తున్న ఉద్యోగాలకు అర్థమే ఉండదు. ఇటీవలి కాలంలో పలు శాఖల్లో కనిపిస్తున్న ఆలస్యాలు, అనవసర జాప్యాలు, కొన్నిచోట్ల అవినీతి ఆరోపణలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి.
ఒక సాధారణ పౌరుడు తన హక్కుగా పొందాల్సిన సేవ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం బాధాకరం. ఇది కేవలం వ్యవస్థ లోపమే కాదు, బాధ్యతాభావం తగ్గిపోతున్న సంకేతం. అవినీతి సమస్య ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదనే వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే. చిన్న పని కోసం కూడా అనధికారిక చెల్లింపులు కోరే పరిస్థితులు కొనసాగితే, అది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న డిజిటల్ సేవలు, ఆన్‌లైన్ విధానాలు పారదర్శకతను పెంచుతున్నా, వాటి అమలులో ఉద్యోగుల నిబద్ధత కీలకం. ఈ నేపథ్యంలో ఉద్యోగుల దృక్పథంలో మార్పు అత్యవసరం. విధి నిర్వహణను కేవలం ఉద్యోగ బాధ్యతగా కాకుండా ప్రజా సేవగా చూడాలి. సమయపాలన, పారదర్శకత, వినయపూర్వక వ్యవహారం – ఇవి అదనపు గుణాలు కాదు, ప్రాథమిక అవసరాలు. ప్రజలతో వ్యవహరించే ప్రతి ఉద్యోగి తన నిర్ణయం ఒక కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తుందనే అవగాహన కలిగి ఉండాలి.
ఇక జవాబుదారీతనం విషయంలో కూడా స్పష్టత అవసరం. పనిలో జాప్యం లేదా లోపం చోటు చేసుకుంటే, దానికి బాధ్యత వహించే వ్యవస్థ బలపడాలి. బాధ్యతను తప్పించుకునే సంస్కృతి కొనసాగితే, సంస్కరణలు ఫలించవు. మంచి పనిచేసిన వారిని గుర్తించడం ఎంత ముఖ్యమో, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం అంతే అవసరం. ప్రభుత్వం కూడా తనవంతు బాధ్యతను నిర్వర్తించాలి. ఉద్యోగులకు తగిన శిక్షణ, సాంకేతిక మద్దతు, స్పష్టమైన విధానాలు అందించాలి.
పనితీరును అంచనా వేసే విధానాలు పారదర్శకంగా ఉండాలి. అదే సమయంలో నిజాయితీగా పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహించే సంస్కృతి ఏర్పడాలి. ప్రజల పాత్ర కూడా ఈ సందర్భంలో కీలకం. అవినీతికి సహకరించకుండా, చట్టబద్ధ మార్గాల్లో సేవలు పొందే ప్రయత్నం చేయాలి. తప్పులను ప్రశ్నించే ధైర్యం పెంపొందాలి. ప్రజల అప్రమత్తతే వ్యవస్థను సరిదిద్దగల శక్తి.
ఉద్యోగం-బాధ్యత
మొత్తానికి, తెలంగాణ అభివృద్ధి కథ మరింత బలపడాలంటే పరిపాలనలో నాణ్యత పెరగాలి. ఆ నాణ్యతకు మూలం ఉద్యోగుల పనితీరు. వారు బాధ్యతను గుర్తించి, సేవాభావంతో పనిచేస్తేనే ప్రజల విశ్వాసం నిలుస్తుంది. అభివృద్ధి గణాంకాలకంటే ప్రజల సంతృప్తి ముఖ్యం అనే సత్యాన్ని గుర్తించే సమయం ఇదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రెండు గంటలు అధికంగా పనిచేస్తామన్న ఉద్యమ కాలం నాటి మాటలు ప్రతిజ్ఞలు తీర్మానాలు ప్రతి సందర్భంలో గుర్తుచేసుకోవాలి. పెరిగిన పీఆర్ సీ పెరగాల్సిన పీఆర్సీ లు , టీ ఏ లు డిఏలు రావలసిన బకాయిలు ఎంత ముఖ్యమో ప్రజలు కట్టే పన్నుల్లోంచి జీతాలు తీసుకునే మనకు ఆ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం అంతే ముఖ్యమని జీతం తీసుకుంటున్న ప్రతిసారి గుర్తెరగాలి.
- సురేష్ కాలేరు, రాష్ట్ర సహాధ్యక్షులు
తెలంగాణ ఉద్యోగుల సంఘం
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
