రాహుల్​ భద్రతపై అమిత్​ షాకు ఖర్గే లేఖ

రాహుల్​ భద్రతపై అమిత్​ షాకు ఖర్గే లేఖ

న్యూఢిల్లీ: అస్సాంలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తంచేశారు. రాహుల్​కు ఎదురవుతున్న సెక్యూరిటీ సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్​షాకు ఖర్గే బుధవారం లేఖ రాశారు. రాహుల్​కు మరింత సెక్యూరిటీ కల్పించాలని కోరారు. అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా భద్రత కల్పించడంలో ఆ రాష్ట్ర సర్కారు ఫెయిల్ అయిందని ఆరోపించారు.

లఖింపూర్ జిల్లాలో యాత్రకు సంబంధించిన పోస్టర్లు, హోర్డింగ్​లను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేయడం, ఆపై సోనిత్​పుర జిల్లాలో జైరాం రమేశ్ కారుపై దాడి, యాత్రలో పాల్గొన్నోళ్లపై నీళ్లు పోయడం వంటి ఘటనలను ఖర్గే లేఖలో ప్రస్తావించారు. అదే జిల్లాలో బీజేపీ కార్యకర్తలు  రాహుల్ కాన్వాయ్ దగ్గరదాకా వచ్చి అడ్డుకున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అమిత్​షా జోక్యం చేసుకోవాలని ఖర్గే లేఖలో కోరారు.