ఫుడ్ వేస్ట్‌‌తో ‘కాంక్రీట్’

ఫుడ్ వేస్ట్‌‌తో ‘కాంక్రీట్’

ప్రపంచంలో ఏటా మనం తీసుకునే ఆహారంలో మూడో వంతు వేస్ట్ అవుతోందన్నది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థ అంచనా. ఈ ఫుడ్ వేస్ట్‌‌ను కంట్రోల్ చేయడం చాలా అవసరం. అదే సమయంలో వేస్ట్‌‌ అవుతున్న దానిని వృథాగా పడేయకుండా ఇతర అవసరాలకు ఏ విధంగా వాడుకోగలమన్నదానిపై జపాన్ సైంటిస్టుల ప్రయోగాలు.. కొత్త కాంక్రీట్‌‌ మెటీరియల్‌‌ను ప్రపంచానికి పరిచయం చేశాయి. మనం తినగలిగే ఆహారమే కాదు.. వేస్ట్‌‌గా పడేసే తొక్కలు లాంటి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చని తేల్చారు. ఫుడ్ వేస్ట్‌‌తో సిమెంట్‌‌ లాంటి పౌడర్‌‌‌‌ను బిల్డింగ్ కన్‌‌స్ట్రక్షన్‌‌ కోసం వాడగలిగేలా తయారు చేశారు. అది మనం వాడే సిమెంట్ కాంక్రీట్‌‌తో సమానంగా స్ట్రాంగ్‌‌గా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఫుడ్‌‌ వేస్ట్‌‌కు అదనంగా సీవీడ్‌‌
బిల్డింగ్‌‌ కన్‌‌స్ట్రక్షన్ స్ట్రాంగ్‌‌గా ఉండాలంటే తడిపినప్పుడు జిగురుగా వచ్చి, డ్రై అయ్యాక నిర్మాణం బలంగా ఉండాలని ప్రొఫెసర్ యుయా సకాయ్ అన్నారు. అందుకే ఫుడ్ వేస్ట్‌‌తో పాటు సీవీడ్ (సముద్రపు నాచు)ను వాడామని చెప్పారు. దీంతో కొత్త కన్‌‌స్ట్రక్షన్ మెటీరియల్‌‌ కూడా రెగ్యులర్‌‌‌‌గా వాడే సిమెంట్‌‌ కాంక్రీట్‌‌తో సమానంగా స్ట్రాంగ్‌‌గా ఉందని తెలిపారు. అయితే దీని తయారీలో తినే వస్తువులు వాడడం వల్ల కన్‌‌స్ట్రక్షన్ తర్వాత దాని స్మెల్, టేస్ట్ లాంటివి ఎలా మారుతుందన్నది కూడా పరిశీలించామన్నారు. అయితే ఈ రీసైకిలింగ్‌‌ ప్రాసెస్‌‌ వల్ల టేస్ట్‌‌లో ఏ మార్పు రాలేదని చెప్పారు. కన్‌‌స్ట్రక్షన్ తర్వాత నాలుగు నెలల పాటు పరిశీలించామని, ఫంగస్ చేరడం, చెదలు పట్టడం లాంటివి కూడా రాలేదని వివరించారు.

టార్గెట్‌‌ను మించి స్ట్రాంగ్‌‌గా..
సైంటిస్టులు ఫుడ్ వేస్ట్‌‌ను రీసైకిలింగ్ చేసిన తర్వాత వచ్చిన మెటీరియల్‌‌ సుమారుగా ఎంత స్ట్రాంగ్‌‌గా ఉంటే అది కన్‌‌స్ట్రక్షన్‌‌లో పనికొస్తుందన్న అంచనాతో కొన్ని టార్గెట్స్‌‌ పెట్టుకున్నారు. అయితే కొన్ని ఫుడ్స్‌‌తో తయారు చేసిన మెటీరియల్స్‌‌ వాళ్లు పెట్టుకున్న టార్గెట్‌‌ను దాటిపోయాయి. క్యాబేజీ ఆకులను వాడి తయారు చేసిన మెటీరియల్ మామూలు కాంక్రీట్‌‌ కంటే మూడు రెట్లు స్ట్రాంగ్​గా ఉందని మరో సైంటిస్ట్ కొటా మచిడా తెలిపారు. క్యాబేజీ ఆకులు, గుమ్మడి  కాయ కలిపితే మరింత గట్టిగా తయారైందన్నారు. తాము కూరగాయలు, ఫ్రూట్స్‌‌తో పాటు వాటి నుంచి వచ్చే తొక్కలు లాంటివి కూడా కన్‌‌స్ట్రక్షన్ మెటీరియల్‌‌ తయారీలో పరిశీలించామని, అన్ని స్ట్రాంగ్‌‌గానే ఉన్నాయని చెప్పారు. అరటి, ఆరెంజ్‌‌ సహా అనేక రకాల ఫ్రూట్స్ తొక్కలను కూడా వాడామన్నారు.  తమ ప్రయోగాల పూర్తి వివరాలను త్వరలో జపాన్‌‌లో జరిగే ద సొసైటీ ఆఫ్ మెటీరియల్‌‌ సైన్స్‌‌ 70వ వార్షిక సమావేశంలో ‘డెవలప్‌‌మెంట్‌‌ ఆఫ్ నావెల్ కన్‌‌స్ట్రక్షన్ మెటీరియల్ ఫ్రం ఫుడ్ వేస్ట్‌‌’ అనే పేరుతో ప్రెజెంటేషన్‌‌ ఇవ్వనున్నట్టు చెప్పారు.

హీట్‌‌ ప్రెస్సింగ్‌‌ కాన్సెప్ట్‌‌తో..
జపాన్‌‌లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో ఉన్న ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సైన్స్‌‌కు చెందిన సైంటిస్టులు ఫుడ్‌‌ వేస్ట్‌‌ను కన్‌‌స్ట్రక్షన్ మెటీరియల్‌‌గా మార్చడానికి రకరకాల టెక్నిక్స్‌‌పై స్టడీ చేశారు. ఫైనల్‌‌గా చెక్క పొడి నుంచి కన్‌‌స్ట్రక్షన్ మెటీరియల్‌‌ తయారు చేయడానికి వాడే హీట్‌‌ ప్రెస్సింగ్ టెక్నిక్‌‌తో సక్సెస్‌‌ అయ్యారు. అయితే ఫుడ్‌‌ వేస్ట్‌‌ను ప్రాసెస్ చేయడంలో అదనంగా వ్యాక్యూమ్‌‌ ద్వారా పూర్తిగా డ్రై చేసి, ఆ తర్వాత హై టెంపరేచర్‌‌‌‌ వద్ద హీట్‌‌ చేశారు. ఆ తర్వాత తయారు చేసిన పౌడర్‌‌‌‌ను బిల్డింగ్‌‌ కన్‌‌స్ట్రక్షన్‌‌లో వాడితే ఎంత బలంగా ఉంటుందన్నదానిని టెస్ట్ చేశారు.