అంత్యక్రియలైన వారానికి ఇంటికి.. షాకైన కుటుంబీకులు

అంత్యక్రియలైన వారానికి ఇంటికి.. షాకైన కుటుంబీకులు

రాజ్‌‌సమంద్: చనిపోయిన వాళ్లు తిరిగి వస్తే ఎలా ఉంటుంది. నిజంగా షాకింగ్ కదా. అలాంటి ఓ ఘటనే రాజస్థాన్‌‌లోని రాజ్‌సమంద్‌లో జరిగింది. ఓంకార్ గదూలియా అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. రీసెంట్‌గా అతడికి కాలేయ సంబంధింత సమస్యలు రావడంతో ఫ్యామిలీకి చెప్పకుండా మే 11న ఉదయ్‌ పూర్‌కు వెళ్లాడు. ట్రీట్‌‌మెంట్ కోసం అక్కడి ఆర్‌కే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. అదే రోజున మోహీ ఏరియాకు చెందిన ప్రజాపత్ అనే వ్యక్తిని కూడా అదే ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అయితే చికిత్స పొందుతూ ప్రజాపత్ చనిపోయాడు. అతడి బాడీని అన్‌‌ఐడెంటిఫైడెడ్‌‌గా గుర్తించిన ఆస్పత్రి యాజమాన్యం మార్చురీలో పెట్టింది. దీనిపై ఓ ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేసింది. ఆ తర్వాత రెండ్రోజులకు ఆస్పత్రికి వచ్చిన ఓంకార్ కుటుంబ సభ్యులు.. ప్రజాపత్ డెడ్ బాడీని చూశారు. 

ఓంకార్ గదూలియా చేతికి ఉన్న మచ్చే ప్రజాపత్ చేతికీ ఉండటంతో ఆ డెడ్‌బాడీ గదూలియాదేనని అతడి కుటుంబీకులు చెప్పారు. దీంతో పోలీసులు కూడా ప్రజాపత్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం, డీఎన్‌‌ఏ టెస్ట్ చేయకుండానే ఓంకార్ కుటుంబీకులకు అప్పగించారు. మే 15న ఓంకార్ కుటుంబీకులు ప్రజాపత్ డెడ్‌‌బాడీని తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ తర్వాత మే 23న హఠాత్తుగా ఓంకార్ ఇంటికి తిరిగిరావడంతో అతడి కుటుంబీకులు షాక్‌కు గురయ్యారు. చనిపోయిన ఓంకార్ ఎలా తిరిగొచ్చాడా అని ఆశ్యర్యపోయారు. ఈ విషయాన్ని పోలీసులుకు చెప్పడంతో వారు విచారణను ప్రారంభించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఓంకార్ కుటుంబీకులు దహన సంస్కారాలు నిర్వహించిన బాడీ గోవర్ధన్ ప్రజాపత్‌‌దని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసుల తప్పేమీ లేదని, ఆస్పత్రి యాజమాన్యానిదే తప్పని కంక్రోలీ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ యోగేంద్ర వ్యాస్ చెప్పారు.