సూర్య కుమార్‌ను ఆపడం అంత ఈజీ కాదు

సూర్య కుమార్‌ను ఆపడం అంత ఈజీ కాదు

శ్రీలంకతో పర్యటనలో బ్యాట్స్‌మన్ సూర్య కుమార్ యాదవ్ అదరగొడుతున్నాడు. తొలి టీ20లో 33 బంతుల్లోనే అర్ధ  సెంచరీ చేసి తన సత్తా చాటుకున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సులతో అలరించాడు. దీంతో సూర్యపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. టీమిండియాకు మరో మంచి బ్యాట్స్‌మన్ దొరికాడని వెటరన్ క్రికెటర్లు మెచ్చుకుంటున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా కూడా సూర్య బ్యాటింగ్ ప్రతిభ తనను బాగా ఆకట్టుకుందని అంటున్నాడు. ఎంతో అనుభవం కలిగిన ప్లేయర్‌లా అతడి ఇన్నింగ్స్ కొనసాగిందన్నాడు. 

‘సూర్య కుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కొత్త ప్లేయర్‌ ఆడుతున్నట్లుగా కనిపించలేదు. అనుభవం ఉన్న ప్లేయర్‌లా ఆడి తానేంటో నిరూపించుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై అవకాశం వచ్చిన ప్రతిసారి సూర్య కుమార్ రాణిస్తున్నాడు. రిస్క్ తీసుకోకుండా తనదైన శైలిలో షాట్లు కొడుతున్న తీరు అద్భుతంగా ఉంది. స్లో బాల్స్, యార్కర్, బౌన్సర్ దేనితోనూ సూర్యను ఆపలేం. ఎందుకంటే అతడి దగ్గర అటాక్ చేయడానికి వైవిధ్యమైన షాట్లు ఎన్నో ఉన్నాయి. అటాకింగ్‌లో అతడు బలంగా ఉన్నాడు. ఎక్కువ చాన్స్‌లు తీస్కొని రిస్కీ క్రికెట్ ఆడే వైట్ బాల్ క్రికెట్‌లో నిలకడగా ఆడటం చాలా కష్టం. కానీ దీన్ని సూర్య కుమార్ చేసి చూపుతున్నాడు’ అని రమీజ్ రాజా పేర్కొన్నాడు.