- గ్రామాల్లో 100 రోజుల స్పెషల్ డ్రైవ్
- టీబీ రోగుల కోసం పంచాయతీ నిధుల్లో ప్రత్యేక కేటాయింపులు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా క్షయ (టీబీ) వ్యాధిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పల్లె స్థాయి నుంచే ఈ వ్యాధిని నిర్మూలించేలా ‘టీబీ ముక్త్ పంచాయతీ’ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కమిషనర్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల జడ్పీ సీఈవోలు, డీపీవోలకు ఆదేశాలు జారీ చేశారు. 100 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణతో గ్రామాల్లో టీబీని తరిమికొట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.
ఈ కార్యక్రమ సక్సెస్ లో గ్రామసభలు, గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామసభల్లో టీబీ నిర్మూలనపై చర్చించడంతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ క్షయ నిర్మూలన ప్రతిజ్ఞ చేసేలా చూడాలని పేర్కొంది.
పంచాయతీ బడ్జెట్లో కేటాయింపులు
టీబీ రోగులకు మెరుగైన సేవలందించేందుకు గ్రామ పంచాయతీలు తమ బడ్జెట్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వం సూచించింది. రోగులను ఆస్పత్రులకు తరలించడం, చిన్నపాటి చికిత్సల కోసం ఈ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. ఆరోగ్య శాఖ సమన్వయంతో గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి, అనుమానితులకు తక్షణ పరీక్షలు జరిపించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. టీబీ రోగులకు పౌష్టికాహారం, సామాజిక మద్దతు అందించేందుకు ‘నిక్షయ్ మిత్ర’లను పెద్ద ఎత్తున నమోదు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి కార్యాలయం, ప్రజా ప్రతినిధులు ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరింది. నిర్ణీత లక్ష్యాలను పూర్తిచేసి పారదర్శకంగా చికిత్స అందించే పంచాయతీలకు ‘టీబీ ముక్త్ గ్రామ పంచాయతీ’ హోదా కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.
100 రోజుల స్పెషల్ డ్రైవ్
ఇప్పటికే ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన 100 రోజుల స్పెషల్ క్యాంపెయిన్ ను స్పీడప్ చేయాలని కేంద్ర ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖలు రాష్ట్రాలకు సూచించాయి. వచ్చే ఏడాది నాటికి క్షయ రహిత గ్రామాలే లక్ష్యంగా పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖలు సంయుక్తంగా పనిచేయనున్నాయి.
