మలయాళంలో మెప్పించిన ‘వాలా 2’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. సావిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ నటించారు. విపిన్ దాస్‌తో కలిసి సాహు గారపాటి మలయాళంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 24న తెలుగులో సినిమా రిలీజ్. మంగళవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో తేజసజ్జా, దర్శకులు గోపీచంద్ మలినేని, సాగర్ చంద్ర అతిథులుగా హాజరయ్యారు. తేజ సజ్జా మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్, టీజర్‌లో ఎంత జోష్ ఉందో మూవీ టీమ్ అందరిలో అంతే జోష్ కనిపిస్తోంది. ఇలాంటి కొన్ని మలయాళ సినిమాలు చూసినప్పుడు చాలా క్రేజీగా తీశారు అనిపిస్తుంది.
నిర్మాత సాహు గారు ఇతర భాషల్లోకి వెళ్లి సినిమాలు చేయడం చాలా మంచి పరిణామం’ అని చెప్పారు. బ్రదర్ ఎమోషన్, ఫ్రెండ్‌షిప్‌లోని ఎమోషన్‌ను చాలా బాగా చూపించిన ఈ చిత్రం తెలుగులోనూ మేజిక్ చేస్తుందని గోపీచంద్ మలినేని, సాగర్ చంద్ర బెస్ట్ విషెస్ చెప్పారు. తాను డైరెక్ట్ చేసిన ‘జయ జయ జయ జయహే’ తరహాలో ఇది కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని విపిన్ దాస్ చెప్పాడు. తెలుగు సినిమాల స్ఫూర్తితో దర్శకుడిని అయ్యానని సావిన్ చెప్పాడు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ ‘చాలా మంచి సినిమా తీశాం. క్లైమాక్స్ చూసినప్పుడు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. మన తెలుగువారు ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తారని భావించి ఇక్కడ విడుదల చేస్తున్నాం. ఈ సినిమాతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’ అని చెప్పారు. అలన్, హషీర్, దేవరాజ్, అజిన్ పాల్గొన్నారు.

