టికెట్ రేట్లు ఎక్కువైతే  విమానమే ఎక్కకండి..దీపావళి విమాన చార్జీల పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు 

టికెట్ రేట్లు ఎక్కువైతే  విమానమే ఎక్కకండి..దీపావళి విమాన చార్జీల పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు 

న్యూఢిల్లీ: టికెట్ రేటు ఎక్కువుంటే విమానమే ఎక్కవద్దని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపలేమని పేర్కొంటూ పిటిషన్‌‌‌‌ను కొట్టివేసింది. దీపావళి పండుగ వేళ దేశీయ విమాన చార్జీలపై పరిమితి విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దాన్ని జస్టిస్ విక్రమ్ నాథ్ సోమవారం విచారించారు. పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ..ప్రైవేట్ ఎయిర్‌‌‌‌లైన్స్ సంస్థలు దీపావళి వేళ డిమాండ్‌‌‌‌ను బట్టి టికెట్ ధరలను విపరీతంగా పెంచుతున్నాయని (సర్జ్ ప్రైసింగ్) కోర్టుకు తెలిపారు.

సాధారణ చార్జీలతో పోలిస్తే పండగల వేళ విమాన టికెట్ల ధరలు 700 శాతం ఎక్కువగా ఉంటున్నాయని వివరించారు. విమాన ప్రయాణం అనేది ఎమర్జెన్సీ సర్వీస్ కిందకు వస్తుందని, ఇలా విపరీతంగా ధరలు పెంచడం పౌరుల సమానత్వ హక్కును (ఆర్టికల్ 14) ఉల్లంఘించడమేనని చెప్పారు. పండుగలు, సెలవులు, అత్యవసర సమయాల్లో ప్రైవేట్ ఎయిర్‌‌‌‌లైన్స్ సంస్థలు తమ ఇష్టానుసారంగా ధరలు వసూలు చేస్తున్నాయన్నారు.

అయితే, ఈ వాదనపై జస్టిస్ విక్రమ్ నాథ్ చాలా సింపుల్‌‌‌‌గా స్పందించారు. "డోంట్ ట్రావెల్ బై ఎయిర్(విమానంలో ప్రయాణించకండి)" అని నాలుగు ముక్కల్లో చిన్న సలహా ఇచ్చి ఆ విషయాన్ని అక్కడితో ముగించేశారు. ధరలు ఎక్కువగా ఉంటే విమానంలో వెళ్లడం మానేయండి అంతేగానీ దీనికి అంత ఆందోళన ఎందుకు అన్నట్లుగా రియాక్ట్ అయ్యారు. ఆ వెంటనే తన జాబితాలో ఉన్న తర్వాతి కేసును వాదనల కోసం పిలవమని సిబ్బందిని ఆదేశించారు. కాగా..విమాన చార్జీలను నియంత్రించడానికి 'భారత వాయుయాన్ అధినియం, 2024' కింద కొత్త నిబంధనలు తెస్తున్నామని, వాటికి త్వరలోనే ఆమోదం లభిస్తుందని కేంద్రం ఇదివరకే కోర్టుకు తెలిపింది. ఆ నిబంధనలను కేంద్రం ఈ నెల16న కోర్టు ముందుకు తీసుకురానుంది.