
- వడ్డీ సొమ్ము రూ.15.17 కోట్లు జమ
కామారెడ్డి, వెలుగు : మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం చేయూతనందిస్తోంది. పెండింగ్ వడ్డీ సొమ్మును ఇటీవల ప్రభుత్వం రిలీజ్ చేసింది. మహిళా శక్తి సంబురాల్లో వడ్డీ సొమ్ము తోపాటు, ప్రమాదబీమా, లోన్ బీమా, బ్యాంక్ లింకేజీ చెక్కులను అందజేస్తున్నారు. ఈ సంబురాల్లో మహిళా సంఘాలు తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి వడ్డీ సొమ్ము రూ.15.17 కోట్లు, సభ్యుల ప్రమాద బీమా డబ్బులు రూ. కోటి 5లక్షలు, లోన్ బీమా రూ. 86 లక్షలు వచ్చాయి.
కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 17,290 మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో 1,68,039 మంది సభ్యులు ఉన్నారు. కొత్తగా మళ్లీ సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు సభ్యులుగా లేక, 18 ఏండ్లు నిండిన వారిని సభ్యులుగా చేరుస్తున్నారు. 2024-, 25 ఆర్థిక ఏడాదిలో 13,460 సంఘాలకు అక్టోబర్ వరకు వడ్డీ డబ్బులు రూ.15.17 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సొమ్మును ఆయా సంఘాల ఖాతాల్లో జమ చేశారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన మహిళా శక్తి సంబురాల్లో సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు.
15 మందికి ప్రమాదబీమా, 131 మందికి లోన్ బీమా
సంఘాల్లో సభ్యులుగా ఉండి ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి బీమా సొమ్ము చెల్లిస్తున్నారు. ఒక్కో సభ్యురాలికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తున్నారు. జిల్లాలో 15 మంది సభ్యులు చనిపోగా వీరికి మొత్తం రూ.కోటి 50 లక్షలు వచ్చాయి. బాన్సువాడ మండలంలో 2, బిచ్కుందలో 2, నిజాంసాగర్‌లో1, పిట్లంలో 1, భిక్కనూరులో 1, కామారెడ్డిలో 1, రాజంపేట1, గాంధారిలో 2, లింగంపేటలో 2, నాగిరెడ్డిపేటలో1, ఎల్లారెడ్డిలో1 ప్రమాద బీమా సొమ్ము వచ్చింది. జిల్లాలో 31 మంది సభ్యులకు లోన్ బీమా రూ. 86 లక్షలు వచ్చాయి. బాన్సువాడ నియోజకవర్గంలో 22 మందికి రూ . 13.98 లక్షలు, జుక్కల్ నియోజక వర్గంలో 26 మందికి రూ.17.28 లక్షలు, కామారెడ్డి నియోజకవర్గంలో 44 మందికి రూ.28.62 లక్షలు, ఎల్లారెడ్డిలో 39 మందికి రూ.26.19 లక్షలు వచ్చాయి.
నియోజక వర్గాల వారీగా అమౌంట్
నియోజక వర్గం సంఘాల సం, వడ్డి సొమ్ము
బాన్సువాడ 1401 1.52 కోట్లు
జుక్కల్ 3510 3.73 కోట్లు
కామారెడ్డి 4241 5.22 కోట్లు
ఎల్లారెడ్డి 4308 4.70 కోట్లు