- లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ ఇస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్థానిక పరిశ్రమలను గ్లోబల్ సప్లై చైన్‌తో అనుసంధానించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాను ఒక గ్రోత్ ఇంజిన్ గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామని వెల్లడించారు. సోమవారం టీ-హబ్‌లో కేంద్ర వాణిజ్య శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన మెగా ఎఫ్‌టీఏ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ తో పాటు, సచివాలయంలో జరిగిన టాస్క్–ఏడబ్ల్యూఎస్ ఒప్పంద కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో ఎగుమతుల పాత్ర అత్యంత కీలకమన్నారు. మేడ్ ఇన్ తెలంగాణ ఉత్పత్తులు ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలన్నింటికీ విస్తరించాలన్నదే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, కలెక్టర్లు మను చౌదరి, ప్రియాంక ఆల, కుష్బూ గుప్త, అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.
కోర్సులను ఉచితంగా యాక్సెస్చేసుకునే వెసులుబాటు
భవిష్యత్ టెక్నాలజీ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రాష్ట్రంలోని 643 టాస్క్ అనుబంధ కళాశాలల్లోని లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ ఏఐ అండ్ క్లౌడ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్ కింద ప్రముఖ టెక్ దిగ్గజం అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.
ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులతోపాటు బీఏ, బీకాం తదితర నాన్-స్టెమ్ కోర్సుల విద్యార్థుల కోసం సులభంగా అర్థమయ్యే ప్రత్యేక లెర్నింగ్ ట్రాక్స్ రూపొందించినట్లు చెప్పారు. కోర్సులో చేరిన ప్రతి ఒక్కరికీ ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ ద్వారా 900 కంటే ఎక్కువ డిజిటల్ కోర్సులను ఏడాది పాటు ఉచితంగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి టాస్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
దీనికి సంబంధించి సెక్రటేరియెట్ లో టాస్క్, ఏడబ్ల్యూఎస్ ప్రతినిధులు మంత్రి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టా రెడ్డి, టాస్క్ సీఈవో నితిన్ రెడ్డి, ఏడబ్ల్యూఎస్ ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్ సందీప్ దత్తా, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ హెడ్ అభినవ్ తదితరులు పాల్గొన్నారు.
