పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి..పరిశ్రమల స్థాపనకు భూములు, రాయితీలు, పూర్తి ప్రోత్సాహకాలు అందిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి..పరిశ్రమల స్థాపనకు భూములు, రాయితీలు, పూర్తి ప్రోత్సాహకాలు అందిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • మహేశ్వరంలో కవి జయరాజు కుటుంబానికి చెందిన ‘ఎన్ఎస్ ఇండస్ట్రీస్’ ప్రారంభించిన భట్టి

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో యువత ఉద్యోగాల వేట వీడి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పారిశ్రామిక రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల కేటాయింపు, రాయితీలు, ప్రోత్సాహకాలను అర్హులైన పారిశ్రామికవేత్తలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ప్రముఖ కవి, వాగ్గేయకారుడు జయరాజు కుటుంబానికి చెందిన ‘ఎన్ఎస్ ఇండస్ట్రీస్’ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమ్మిళిత ఆర్థిక వృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. ఉన్నత విద్య అభ్యసించిన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, సొంతంగా పరిశ్రమలు స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు.

పది మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ‘ఎన్ఎస్ ఇండస్ట్రీస్’ ఏర్పాటు చేసిన యువ పారిశ్రామికవేత్తలు నిశాంత్, సాజన్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వీరికి పారిశ్రామిక ప్రాంతంలో స్థలాల కేటాయింపుకు ప్రభుత్వం సహకరించిందని, వీరు మరెందరో యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. 

కవి జయరాజు సేవలు చిరస్మరణీయం

ప్రముఖ కవి జయరాజు సమాజానికి చేసిన సేవలను భట్టి కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే సింగరేణి కార్మికుల సమస్యలు, శ్రమజీవుల హక్కులు, అణగారిన వర్గాల జీవితాలను తన పాటల ద్వారా ప్రతిబింబిస్తూ ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చారని గుర్తుచేశారు. సామాజిక చైతన్యం కోసం పనిచేసే కళాకారులు, మేధావులను గుర్తించి గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. పాలకులు అధికారాన్ని హోదాగా కాకుండా ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, డిక్కీ అధ్యక్షుడు నర్రా రవికుమార్, టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శివాజీ, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.