మరణశిక్షపై నిషేధం కోరుతూ యూఎన్జీఏ తీర్మానం..వ్యతిరేకంగా ఓటేసిన భారత్

మరణశిక్షపై నిషేధం కోరుతూ యూఎన్జీఏ తీర్మానం..వ్యతిరేకంగా ఓటేసిన భారత్

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షల అమలుపై తాత్కాలిక నిషేధం(మారటోరియం) విధించాలని కోరుతూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ) లో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది.193 సభ్యదేశాలున్న యూఎన్జీఏలో మరణశిక్ష మారటోరియం తీర్మానాన్ని మెక్సికో ప్రవేశపెట్టగా.. శుక్రవారం దీనిపై ఓటింగ్ జరిగింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 133 దేశాలు, వ్యతిరేకంగా 33 దేశాలు ఓటేయగా, 16 దేశాలు ఓటింగ్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్నాయి.

ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన దేశాల జాబితాలో భారత్‌‌‌‌‌‌‌‌తో పాటు అమెరికా, చైనా, పాకిస్తాన్, జపాన్, బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, కువైట్, మాల్దీవులు, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా తదితర దేశాలున్నాయి. మరణశిక్షల అమలు కొనసాగుతుండటంపై ఈ తీర్మానం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. అయితే, అంతర్జాతీయ చట్టాలకు లోబడి తగిన శిక్షలను నిర్ణయించడం సహా తమ సొంత న్యాయ వ్యవస్థలను రూపొందించుకునే హక్కు అన్ని దేశాలకు ఉందని పునరుద్ఘాటించింది.

మరణశిక్షను పూర్తిగా రద్దుచేసే ఉద్దేశంతో తక్షణమే ఉరిశిక్షల అమలుపై తాత్కాలిక నిషేధం విధించాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే మరణశిక్షను రద్దు చేసిన దేశాలు దానిని మళ్లీ ప్రవేశపెట్టవద్దని కోరింది. మరణశిక్ష వినియోగాన్ని దశలవారీగా తగ్గించాలని, 18 ఏళ్ల లోపు వారు చేసిన నేరాలకు మరణశిక్ష విధించరాదని పేర్కొంది. గర్భిణులు, మానసిక వైకల్యం ఉన్నవారు, వృద్ధులకు మరణశిక్ష విధించడంపై ఆంక్షలు విధించాలని యూఎన్ కోరింది.