‘మీ ప్రమాణం’లో అటెండెన్స్ వేయాల్సిందే..డీఎంహెచ్‌‌వోలకు డీపీహెచ్ ఆదేశాలు

‘మీ ప్రమాణం’లో అటెండెన్స్ వేయాల్సిందే..డీఎంహెచ్‌‌వోలకు డీపీహెచ్ ఆదేశాలు
  • ఉద్యోగుల 100 శాతం ఆన్‌‌ బోర్డ్, డైలీ అటెండెన్స్ బాధ్యత జిల్లా ఆఫీసర్లదే 
  • నిర్లక్ష్యం చేస్తే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకమైన అటెండెన్స్​కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మీ ప్రమాణం యాప్​లో ఉద్యోగులందరూ ప్రతిరోజూ తప్పనిసరిగా అటెండెన్స్ వేయాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీపీహెచ్) డాక్టర్ బి.రవీందర్ నాయక్ స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు పదేపదే చెప్పినా ఉద్యోగులు రెగ్యులర్‌‌ గా హాజరు వేయట్లేదని, ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌‌ గా తీసుకుందన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌వోలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ యాప్​లో రిజిస్టర్ లేదా ఆన్‌‌ బోర్డ్ అయ్యేలా, 100 శాతం అటెండెన్స్​నమోదయ్యేలా చూసే బాధ్యత డీఎంహెచ్​వోలదేనని తేల్చిచెప్పారు.

ఇకపై సాకులు చెల్లవు..

ఈ ఆదేశాలు పాటించకపోతే డ్యూటీలో నిర్లక్ష్యంగా పరిగణిస్తామని డీపీహెచ్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సంబంధిత ఉద్యోగితోపాటు కంట్రోలింగ్ ఆఫీసర్, సూపర్‌‌వైజరీ అధికారిపైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చినందున.. ఇకపై టెక్నికల్ సమస్యలనో, అవగాహన లేదనో, రిజిస్ట్రేషన్ కాలేదనో చెప్పే ఎలాంటి సాకులు చెల్లవన్నారు.