
సోఫియా (బల్గేరియా): తెలంగాణ స్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్, అరుంధతి చౌదరీ.. స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన విమెన్స్ 50 కేజీ క్వార్టర్ఫైనల్లో నిఖత్ 5–0తో లఖాదిరి వాసిలా (ఫ్రాన్స్)పై గెలిచింది. బౌట్ ఆరంభం నుంచే ఇద్దరు బాక్సర్లు పరస్పరం పంచ్‌లతో చెలరేగారు. అయితే ఫస్ట్ రౌండ్లో కౌంటర్ అటాక్ పంచ్‌లతో ఆకట్టుకున్న తెలంగాణ బాక్సర్‌కు రెండో రౌండ్లో ప్రత్యర్థి నుంచి కొద్దిగా పోటీ ఎదురైంది. అయినా ఈ రెండు రౌండ్లలోనూ నిఖతే ఆధిక్యంలో నిలిచింది. మూడో రౌండ్లో నిఖత్ క్వాలిటీ పంచ్‌లతో వాసిలాపై విరుచుకుపడింది. ఫ్రాన్స్ బాక్సర్ తేరుకునే ప్రయత్నం చేసినా తెలంగాణ అమ్మాయి ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. 66 కేజీల క్వార్టర్స్‌లో అరుంధతి 5–0తో మటోవిచ్ మిలెనా (సెర్బియా)ను ఓడించింది. 57 కేజీల బౌట్లో సాక్షి 2–3తో మమజోనోవా కుమురాబోను (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడింది.