టీటీడీ లడ్డూ కల్తీ కేసు విచారణ బదిలీకి సుప్రీం నో..ఏమైనా జరిగితే తమవద్దకు రావొచ్చన్న సీజేఐ ధర్మాసనం 

టీటీడీ లడ్డూ కల్తీ కేసు విచారణ బదిలీకి సుప్రీం నో..ఏమైనా జరిగితే తమవద్దకు రావొచ్చన్న సీజేఐ ధర్మాసనం 
  •  మచీంద్ర శాంతారామ్ లంకే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ డిస్మిస్

న్యూఢిల్లీ, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏపీ హైకోర్టు బయటకు ఈ పిటిషన్లను మార్చాలని అభ్యర్థిస్తూ.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహారాష్ట్రకు చెందిన డెయిరీ పరిశ్రమ వ్యాపారి, 'మాల్‌‌‌‌‌‌‌‌గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్' మేనేజింగ్ డైరెక్టర్ మచీంద్ర శాంతారామ్ లంకే దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌ ను కొట్టివేసింది.

మచీంద్ర దాఖలు చేసిన ఈ పిటిషన్లపై గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌‌‌‌‌‌‌‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు పూర్తిగా రాజకీయ సమస్యగా మారిందని పిటిషనర్ తరపు సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఈ వ్యవహారంపై నేరుగా ప్రకటనలు చేశారని కోర్టుకు నివేదించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ల తర్వాత కూడా నేతలు కామెంట్లు చేశారని తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని 'అంతగా భావోద్వేగాలతో ముడిపడి లేని పొరుగు రాష్ట్రానికి’ ఈ కేసును ట్రాన్స్ ఫర్ చేయాలని అభ్యర్థించారు.

ఈ వాదనలపై సీజేఐ స్పందిస్తూ.. "మా ఆదేశంతో వారందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఏమైనా జరిగితే, మీరు మా వద్దకు రావచ్చు" అని వ్యాఖ్యానించారు. ఈ కేసు దర్యాప్తును స్వయంగా సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేపట్టిందని గుర్తు చేశారు. అంతేకాకుండా సాక్ష్యాలు, సాక్షులు అత్యధికంగా ఏపీలోనే ఉన్న   కారణంగా కేసు బదిలీకి సానుకూలంగా స్పందించలేమని పేర్కొంటూ.. పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.