యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి సమస్యలపై అవగాహన కల్పించే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్కాలర్’. కౌశిక్, ప్రతిభా సిన్హా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ గౌడ్, పెంచల్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ కమర్షియల్ సందేశాత్మక చిత్రం ఫస్ట్ లుక్‌ను నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి బాలకోటి రెడ్డి, చక్రవర్తి రెడ్డి, పెంచల్ రెడ్డి అతిథులుగా హాజరై పోస్టర్‌ను విడుదల చేశారు.
డ్రగ్స్‌కు బానిసలైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకొచ్చేందుకు ఓ యువకుడు ప్రత్యేకమైన డ్రగ్‌ను కనిపెట్టడం, ఆ క్రమంలో అతని కుటుంబం డ్రగ్ మాఫియా బారిన పడటం, చివరకు ఆ మాఫియాపై హీరో చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని, స్పిరిచ్యువల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉత్కంఠభరితంగా కథను తెరకెక్కిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా టాలెంటెడ్ స్టూడెంట్స్‌కు మెమెంటోలు, గోల్డ్ మెడల్స్, ప్రశంసాపత్రాలను అందజేశారు.
