కిలో కోడి రూ.110..చికెన్ ధరల స్థిరీకరణకు దేశవ్యాప్త పౌల్ట్రీ సంఘాల ఏకాభిప్రాయం

కిలో కోడి రూ.110..చికెన్ ధరల స్థిరీకరణకు దేశవ్యాప్త పౌల్ట్రీ సంఘాల ఏకాభిప్రాయం
  • దాణా ధరల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరుతూ తీర్మాన

హైదరాబాద్, వెలుగు: లైవ్ చికెన్ ధర కిలో కనీసం రూ.110 ఉండేలా దేశవ్యాప్తంగా ఏకరీతి ధరల విధానాన్ని అమలు చేయాలని పౌల్ట్రీ సంఘాలు నిర్ణయించాయి. కోళ్ల దాణా ధరల తగ్గించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని  కోరాయి. సోమవారం హైదరాబాద్ శంషాబాద్‌‌లోని నోవాటెల్ లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి దేశవ్యాప్త పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులు  హాజరయ్యారు. పండుగల సమయంలో చికెన్ వినియోగం తగ్గడంతో ధరలు పడిపోయాయని, ఇది తాత్కాలికమేనని అభిప్రాయపడ్డారు.

రైతులు, వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ధరల్లో స్థిరత్వం కోసం సంఘాల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. మొక్కజొన్న, సోయాబీన్ ధరల పెరుగుదలతో కోళ్ల దాణా ఖర్చులు భారంగా మారాయని తెలిపారు. జన్యుమార్పిడి మొక్కజొన్నను సుంకాలు లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని, సోయాబీన్ దిగుమతులపైనా వెసులుబాట్లు కల్పించాలని కేంద్రాన్ని కోరారు.

పౌల్ట్రీ రంగ సమస్యలను వచ్చే వారం చివర్లో న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, విధాన నిర్ణేతలను కలవాలని సమావేశంలో నిర్ణయించారు. ఏఐపీబీఏ చైర్మన్ బహదూర్ అలీ, పీఔబీసీసీ కన్వీనర్ వసంత్ కుమార్ శెట్టి, టీపీబీఏ అధ్యక్షుడు డాక్టర్ ఎ. తిరుపతి రెడ్డి, వెంకటేశ్వర హ్యాచరీస్ జనరల్ మేనేజర్ కె.జి. ఆనంద్, షాలిమార్ గ్రూప్ ఎండీ సమీర్ అగర్వాల్, సుగుణ ఫుడ్స్ ఎండీ విఘ్నేష్ సౌందరరాజన్, ప్రీమియం చిక్ ఫీడ్స్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ గిరీష్ కొలంకర్ తదితరులు హాజరయ్యారు.