పేద రైతులకు ‘రూ.5కే భోజనం’ అద్భుతం..ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పేద రైతులకు ‘రూ.5కే భోజనం’ అద్భుతం..ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఉచితంగా అల్పాహారం అందించడం, కేవలం రూ.5కే నాణ్యమైన మధ్యాహ్న భోజన వసతి కల్పించడం హర్షణీయమని ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.3.80 కోట్లతో చేపట్టనున్న వివిధ రకాల మౌలిక వసతులు, అధునాతన మార్కెట్ షెడ్లు, సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పనితీరు బాగుందన్నారు. 

ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మార్కెట్లలోనూ అమలు చేసేలా మార్కెటింగ్ శాఖ మంత్రికి సిఫార్సు చేస్తానని తెలిపారు. పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మరింత అభివృద్ధి చెందడానికి రూ.95 లక్షల నిధులను అందజేస్తామని ప్రకటించారు. సూర్యాపేటలో మామిడి మార్కెట్ ఏర్పాటు కోసం అనువైన 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వెంటనే కేటాయించాల్సిందిగా కలెక్టర్ కు దిశా నిర్దేశం చేశారు. 

విప్లవాత్మక మార్పులు..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం కొత్తగా 16 లక్షల కుటుంబాలను రేషన్ పరిధిలోకి తీసుకువచ్చిందని తెలిపారు.  రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ రెండున్నరేండ్లలో రైతుల నుంచి రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 

సాగు నీటి శాశ్వత పరిష్కారం కోసమే లిఫ్టులు.. 

మేళ్లచెరువు/మఠంపల్లి : నాగార్జున సాగర్ లో నీటి లభ్యత తక్కువ ఉన్నప్పటికీ పులిచింతల బ్యాక్ వాటర్ ద్వారా రైతులకు సాగునీరు అందించడమే ధ్యేయంగా లిఫ్టుల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద నిర్మిస్తున్న ఎంబీసీ లిఫ్ట్ పనులను ఆయన పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. హుజూర్​నగర్ నియోజకవర్గ రైతాంగ చరిత్రలో మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.  ఎంబీసీ లిఫ్ట్ పూర్తయితే హుజూర్​నగర్ నియోజకవర్గంలోని వేలాది మంది రైతులకు సాగునీటి భరోసా కలుగుతుందని తెలిపారు.