అవినీతిపై చర్యలేవి?..మడికొండలోని కాకతీయ టెక్స్ టైల్ అండ్ వీవర్స్ సొసైటీలో రూ.65 కోట్లకుపైగా కుంభకోణం

అవినీతిపై చర్యలేవి?..మడికొండలోని కాకతీయ టెక్స్ టైల్ అండ్ వీవర్స్ సొసైటీలో రూ.65 కోట్లకుపైగా కుంభకోణం
  • అరకొరగా షెడ్లు ఏర్పాటు చేసిన బిల్లులు డ్రా చేసిన బిల్డర్లు
  •     నిధుల దుర్వినియోగంపై గత పాలకవర్గంపై ఆరోపణలు
  •     అధికారులకు ఫిర్యాదు చేసిన సొసైటీ సభ్యులు
  •     నేటికీ చర్యలు కరువు

హనుమకొండ, వెలుగు: నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గ్రేటర్​ వరంగల్​ పరిధి హనుమకొండ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసిన మినీ టెక్స్‌‌టైల్ పార్కులో అక్రమాల నిగ్గు తేలడం లేదు. ఎంఎస్‌‌ఎంఈ పథకం కింద ఏర్పాటు చేసిన పవర్‌‌లూమ్ క్లస్టర్‌‌లో నిర్మాణాలు, యంత్రాల కొనుగోలు పేరుతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం జరిగాయని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఆఫీసర్లకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు లేకపోవడంతో పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పవర్ లూమ్ షెడ్ల పేరుతో ఫండ్స్ గోల్​మాల్​

కేంద్ర ప్రభుత్వ ఎంఎస్‌‌ఎంఈ ఆధ్వర్యంలోని క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌‌ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) పథకం కింద 2009లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 364 మంది సభ్యులతో కాకతీయ టెక్స్‌‌టైల్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ పొదుపు, పరపతి పరస్పర సహకార సంఘం లిమిటెడ్​ ఏర్పాటైంది. రాష్ట్రంలో తొలి పవర్‌‌లూమ్ క్లస్టర్ కోసం టీజీఐఐసీ ఆధ్వర్యంలో మడికొండలో 60 ఎకరాల భూమిని కేటాయించి, 364 యూనిట్లకు ఒక్కోదానికి 500 గజాల చొప్పున స్థలాలు కేటాయించారు. 

అయితే 364 మందిలో 164 మంది మాత్రమే ఇండస్ట్రీల ఏర్పాటుకు ముందుకు రావడంతో వారికి కెనరా బ్యాంకు హనుమకొండ, వరంగల్ బ్రాంచ్​లు సుమారు రూ.కోటి వరకు లోన్లు మంజూరు చేశాయి. డీపీఆర్ ప్రకారం షెడ్లు, కలర్ రూఫ్, ఫ్లోరింగ్, షట్టర్లు, మోటార్ సెట్లు, ఫర్నిచర్ తదితర పనులకు ఒక్కో యూనిట్‌‌పై రూ.17 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఖర్చవ్వాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు, అప్పటి సొసైటీ డైరెక్టర్లు కుమ్మక్కై వ్యయాన్ని రూ.45 లక్షల వరకు చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా పవర్‌‌లూమ్ మెషిన్ల కొనుగోలులోనూ ఫ్రాడ్​జరిగినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక్కో యూనిట్ పేరుతో సుమారు రూ.40 లక్షల మేర అక్రమాలు జరిగాయని, మొత్తం 164 యూనిట్లలో కలిపి రూ.65 కోట్లకు పైగా నిధులు గోల్‌‌మాల్ అయినట్లు వారు చెబుతున్నారు.

15 ఏండ్లుగా రికార్డుల్లేవు... 

2009 లో ఏర్పాటైన సొసైటీని రెండేళ్ల కింద వరకు నిర్వహించిన కమిటీ తమను పూర్తిగా మోసం చేసిందని సభ్యులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం-1995 ప్రకారం ప్రతి ఏడాది జనరల్​ బాడీ మీటింగ్స్​నిర్వహించి, ఆడిట్ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ, గత కమిటీ 2009 నుంచి 2024 వరకు దాదాపు 15 ఏండ్ల పాటు సరైన రికార్డులు నిర్వహించకపోగా, ఆడిట్ రిపోర్టులను కూడా ఆఫీసర్లకు అప్పగించలేదని సభ్యులు ఆరోపిస్తున్నారు. పార్కు నిర్లక్ష్యానికి గురికావడంతో 2024 మేలో కొత్త కమిటీ ఎన్నికైనప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని వారు వాపోతున్నారు.

ఫిర్యాదు చేసినా నో యాక్షన్.. 

అక్రమాలపై సభ్యులు ఇప్పటికే హనుమకొండ కలెక్టర్, డిస్ట్రిక్ట్​కోఆపరేటివ్​ ఆఫీసర్​తోపాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. స్పందన లేకపోవడంతో గతేడాది జూన్‌‌లో సహకార సంఘాల కమిషనర్‌‌కు కూడా కంప్లైంట్​ ఇచ్చారు. నెలలు గడిచినా ఎలాంటి యాక్షన్​తీసుకోలేదని సభ్యులు ఆరోపిస్తున్నారు. గత పాలకవర్గంతో పాటు 2024లో ఎన్నికైన కొత్త కమిటీ కూడా కుమ్మక్కై అక్రమాలను బయటకు రానివ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 7న కూడా హనుమకొండ డీసీవో ఆఫీస్​లో మరోసారి ఫిర్యాదు చేసిన వారు, ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

విచారణ చేసి చర్యలు తీసుకుంటాం..

మడికొండ కాకతీయ టెక్స్ టైల్ అండ్ వీవర్స్ వెల్ఫేర్​ పొదుపు, పరపతి పరస్పర సహకార సంఘానికి సంబంధించిన ఫిర్యాదు అందింది. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోఆపరేటివ్ సొసైటీస్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ను విచారణాధికారిగా నియమించాం. ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం.- బి.మోహన్, డీసీవో, హనుమకొండ