ప్రముఖ కార్ల తయారీ సంస్థ BYD కొత్తగా ‘డాల్ఫిన్ G DM-i’ అనే లేటెస్ట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును మార్కెట్లోకి పరిచయం చేసింది. సాధారణంగా చైనా కంపెనీలు ఆ దేశంలో ఉన్న మోడళ్లనే కొద్దిగా మార్చి ఇతర దేశాల్లో అమ్ముతుంటాయి. కానీ, ఈ సరికొత్త హ్యాచ్‌బ్యాక్ కారును మాత్రం మొదటి నుంచే యూరప్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా తయారు చేశారు........
కార్ డెలివరీలు
ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉండాలనుకునే వారి కోసం ఈ కారును డిజైన్ చేశారు. ఈ ఏడాది (2026) చివరిలోగా యూరప్‌లో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కారు ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్లో దాదాపు రూ. 36.65 లక్షలకు అమ్ముడవుతున్న హోండా జాజ్ హైబ్రిడ్ కారు కంటే దీని ధర చాలా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.
ఈ కారు పొడవు 4,160 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇది మార్కెట్లో ఉన్న వోక్స్‌వ్యాగన్ పోలో, టయోటా యారిస్, రెనాల్ట్ క్లియో వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మిగతా కంపెనీల కార్లు నార్మల్ హైబ్రిడ్ ఫీచర్లతో వస్తుంటే, ఈ BYD డాల్ఫిన్ కారు మాత్రం పూర్తి స్థాయి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తోంది. అంటే దీనిని కరెంట్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే పెట్రోల్‌తోనూ నడపవచ్చు.
1,000 కిలోమీటర్లు
ఈ కారును ఒక్కసారి ఫుల్ చేస్తే అంటే బ్యాటరీ ఛార్జింగ్ + పెట్రోల్ ట్యాంక్ ఏకంగా 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇందులో ఎక్కువ భాగం కారు బ్యాటరీ (ఎలక్ట్రిక్) పవర్‌తోనే నడుస్తుంది. పెట్రోల్ ఇంజిన్ కేవలం బ్యాటరీ సామర్థ్యాన్ని, మైలేజ్‌ను పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ కారులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, BYDకి చెందిన పవర్‌ఫుల్ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని, ముందు భాగంలో ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది.
