దేశంలో 2 మెగా మొబైల్‌‌ హాస్పిటళ్లు

దేశంలో 2 మెగా మొబైల్‌‌ హాస్పిటళ్లు
  • ఢిల్లీ, చెన్నైల్లో ఒక్కోటి ఏర్పాటు
  •  మన్ సుఖ్ మాండవీయ వెల్లడి

న్యూఢిల్లీ: అత్యవసర పరిస్థితిలో హుటాహుటిన వచ్చి ఆదుకునేందుకు వీలుగా అన్ని అత్యాధునిక పరికరాలు, సౌకర్యాలతో కూడిన రెండు కంటైనర్ బేస్డ్ మొబైల్ హాస్పిటళ్లను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రకటించారు. దాదాపు 100 బెడ్ల ఏర్పాటుకు వీలుగా పరికరాలు అమర్చిన ఈ హాస్పిటళ్లను ఢిల్లీ, చెన్నైల్లో సిద్ధంగా ఉంచనున్నట్లు మంగళవారం ఆయన మీడియాకు చెప్పారు. ‘‘అవసరాన్ని బట్టి వీటిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా కానీ, రైల్ రూట్లో కానీ తరలిస్తారు. దక్షిణాసియాలో ఇలాంటి సౌకర్యమున్న రెండో దేశంగా మన దేశం నిలవనుంది” అని వివరించారు.
ఆయుష్మాన్‌‌తో అద్భుతాలు
కొవిడ్ సవాలును దేశ ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి ఒక అవకాశంగా మోడీ ప్రభుత్వం స్వీకరించిందని మంత్రి అన్నారు. ఇందుకోసం రూ.64 వేల కోట్లతో పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్​ఫ్రా మిషన్ తెచ్చింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం రూ.100 కోట్లు వెచ్చించడం జరుగుతుంది. తర్వాత దశలవారీగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 11,024 అర్బన్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటవుతాయి” అని చెప్పారు. పిల్లల కొవిడ్ వ్యాక్సీన్ జైకోవీ డీ ధరపై ఇంకా చర్చలు జరుగుతున్నాయన్నారు. కొత్తగా తెరపైకి వచ్చిన ఏవై.4.2 తో పాటు పలు కొవిడ్ వేరియంట్లపై ఐసీఎంఆర్, ఎన్సీడీసీ బృందాలు రీసెర్చ్ చేస్తున్నాయని చెప్పారు.