నోట్లో 38 పళ్లు.. గిన్నిస్ రికార్డ్

నోట్లో 38 పళ్లు.. గిన్నిస్ రికార్డ్

సాధారణంగా ఎవరికైనా 32  పళ్లు ఉంటాయి.  అంటే పైదవడ .. కింది దవడ కలిపి 32పళ్లుంటాయి. కానీ  ఓ మహిళ తన నోటిలో ఉండే పళ్లతో గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించింది.  ఈ మహిళకు 38 పళ్లు ఉన్నాయి. దీంతో కల్పనా బాలన్ అనే ఇండియాకు చెందిన 26 ఏళ్ల మహిళ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. ఆమెకు దిగువ దవడపై నాలుగు అదనపు దంతాలు.. పై దవడ  వరుసలో రెండు అదనపు పళ్లు వచ్చాయి.

కల్పనా బాలన్, యుక్త వయస్సులో ఉన్నప్పుడు సూపర్‌ జ్ఞాన దంతాలు అదనంగా పెరిగాయి. మొదట్లో  వాటిని తీసేయాలని భావించి దంత వైద్యులను సంప్రదించారు. తర్వాత వాటిని తీసేయొద్దని నిర్ణయించుకున్నట్లు బాలన్ తెలిపారు.  అదనపు దంతాలు తన ఆరోగ్యానికి ఎటువంటి కష్టం కలిగించనందున, పైగా నోట్లో నొప్పిని కలిగించవు కాబట్టి వాటిని తొలగించలేదని ఆమె తెలిపారు.ఇవే కాక ఆమెకు మరో రెండు దంతాలు రానున్నాయని, భవిష్యత్ లో మరో రికార్డు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు దంత వైద్యులు నిర్ధారించారన్నారు.అధిక దంతాలు ఉంటే దానిని  హైపర్‌డోంటియా అంటారు.   

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో తాను నమోదు కావడం  చాలా సంతోషంగా ఉందని కల్పనా బాలన్  అన్నారు. ఇది తాను  సాధించిన విజయమంటూ 38 పళ్ల  గురించి గొప్పగా భావిస్తున్నానని ఆమె ట్వీట్ చేశారు. 

పురుషుల విభాగంలో ఈ రికార్డు కెనడాకు చెందిన ఇవానో మలోన్ పేరిట ఉంది. అతనికి మొత్తం 41 దంతాలు ఉన్నాయి. ప్రస్తుతం కల్పన గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఆమె ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.