వాటిదే రాజ్యం : ఉత్తరాఖండ్ లో 3 వేల పులులు..

వాటిదే రాజ్యం : ఉత్తరాఖండ్ లో 3 వేల పులులు..

ఉత్తరాఖండ్‌లో 2015 నుంచి ఇప్పటివరకు చిరుతపులుల సంఖ్యలో భారీ పెరుగుదల నమోదైంది. ఆగస్టు 4న అటవీ శాఖ విడుదల చేసిన పిల్లి జాతుల జనాభా అంచనాలను వెల్లడించింది. ఉత్తరాఖండ్, ఇతర రాష్ట్రాలకు పులుల సంఖ్యను సైతం తెలిపింది. అటవీ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉత్తరాఖండ్‌లో చిరుతపులి జనాభా 3వేల 115గా ఉంది.

2015 చివరి అంచనాల ప్రకారం హిమాలయ రాష్ట్రంలో 2 వేల 335 చిరుతపులులు ఉన్నాయి. గత ఎనిమిదేళ్లలో ఇది 29 శాతం వృద్ధిని కనబర్చింది. మానవులు- చిరుతపులుల మధ్య తరచుగా ఘర్షణలు జరిగే రాష్ట్రాలలో ఉత్తరాఖండ్ ఒకటి కాబట్టి ఈ గణాంకాలు అత్యంత కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి.

అటవీ శాఖ సేకరించిన సమాచారం ప్రకారం.. జనవరి 2000 - జూన్ 2023 మధ్య చిరుతపులి దాడిలో మొత్తం 508 మంది మరణించారు, 1వెయ్యి 800 మందికి పైగా గాయపడ్డారు. ఏది ఏమైనప్పటికీ, జూన్ 2001 నుంచి ఇప్పటి వరకు అనేక ఇతర ప్రమాదాలు లేదా పరస్పర తగాదాల కారణంగా మొత్తం 1వెయ్యి 658 చిరుతపులుల మరణాలు కూడా నమోదయ్యాయి.

పెరుగుతున్న సంఘర్షణ ఘటనలపై చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ సమీర్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. "చిరుతపులి జనాభా అంచనాలు సమస్యాత్మక ప్రాంతాలను అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడతాయి. మేము ఈ పరిస్థితిని తగ్గించడానికి ప్రయత్నిస్తాం" అని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో అల్మోరా, పౌరీ, ఉత్తరకాశీ, పితోరాఘర్, తెహ్రీ జిల్లాల్లోనూ చిరుతపులి సంఘర్షణ సంఘటనలు చోటుచేసుకున్నట్టు పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే చిరుతపులితో పాటు కోతులు, లంగూర్ల సంఖ్యను కూడా విడుదల చేశారు. 2015 - 2021 మధ్య కాలంలో కోతుల సంఖ్య 26% తగ్గగా, అదే కాలంలో లంగర్ల సంఖ్య 44% తగ్గిందని అటవీశాఖ వెల్లడించింది.