
- రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది నామినేషన్ల ఉపసంహరణ
- ఫలించిన ప్రధాన పార్టీల బుజ్జగింపులు, చర్చలు
- అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,298 మంది
- గ్రేటర్ హైదరాబాద్‌లో 15 స్థానాల్లో 312 మంది
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో రికార్డు స్థాయిలో అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఈ రెండు చోట్ల భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో దిగిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ బుజ్జగింపులు, చర్చలతో వారిలో చాలా మంది పోటీ నుంచి తప్పుకున్నారు. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత గజ్వేల్‌లో 114 మంది బరిలో ఉండగా.. బుధవారం 70 మంది విత్‌డ్రా చేసుకున్నారు. చివరకు అక్కడ 44 మంది పోటీలో నిలిచారు. గజ్వేల్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు.
కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీలో ఉన్న కామారెడ్డి సెగ్మెంట్‌లో 58 నామినేషన్లలో 19 మంది విత్‌డ్రా చేసుకోగా 39 మంది బరిలో ఉన్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 600 మంది అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. విత్ డ్రాకు గడువు ముగియడంతో ఫైనల్‌గా 119 స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య తేలింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 2298 మంది బరిలో నిలిచారు. బుజ్జగింపుల పర్వం, చర్చలతో ప్రధాన పార్టీల రెబల్స్‌తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. నామినేషన్ల స్ర్కూటినీలో 606 రిజెక్ట్ కాగా.. 2898 సరైనవిగా తేల్చారు. వీటిలో నుంచి మరో ఆరు వందల మంది విత్ డ్రా అవ్వగా పోటీలో ఉండే అభ్యర్థులు 2298 ఉండనుంది. ఇంకా పూర్తిస్థాయి సమాచారం రానందున ఫైనల్ నంబర్లో ఒకటి, రెండు మార్పులు చేర్పులు ఉండవచ్చు.
కాంగ్రెస్ లో ఫలించిన చర్చలు
కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపులు ఫలించాయి. రెబల్స్‌గా నామినేషన్లు వేసిన వాళ్లు.. వెనక్కి తగ్గారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారమే చివరి రోజు కావడంతో.. పార్టీ ముఖ్య నేతలు మంగళవారం నుంచే రెబల్ అభ్యర్థులతో చర్చలు జరిపారు. 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు రెబల్స్‌గా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. బుజ్జగించినా.. బుధవారం మధ్యాహ్నం వరకు కొందరు నేతలు పట్టు వీడలేదు. ఎలాగోలా వారినీ పార్టీ నేతలు బరి నుంచి తప్పుకునేలా ఒప్పించారు. బుధవారం ఉదయం సూర్యాపేటలోని పటేల్ రమేశ్ రెడ్డి ఇంటికి ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి వెళ్లారు. ఏఐసీసీ కార్యదర్శి పదవి ఇవ్వడంతో పాటు నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని రమేశ్ రెడ్డికి రోహిత్ చౌదరి హామీ ఇచ్చారు.
ఇటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పటేల్ రమేశ్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ సిఫార్సు చేశారు. వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అయితే హైకమాండ్ తీరుపై ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. తాను పార్టీలో కొనసాగాలంటే డీసీసీతో పాటు వరంగల్‌సిటీ కాంగ్రెస్ పోస్టులు తన వర్గానికి ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. దీనిపై క్లారిటీ వచ్చాకే పార్టీ కోసం పనిచేయాలా.. లేదంటే పార్టీకి రాజీనామా చేయాలా అనేదానిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. బాన్సువాడలో కాసుల బాలరాజు, డోర్నకల్‌లో నెహ్రూ నాయక్, వరంగల్ ఈస్ట్‌లో రాఘవరెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రాంరెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. మంగళవారం సంగారెడ్డిలో తన నామినేషన్ వెనక్కు తీసుకున్న గాలి అనిల్ కుమార్.. బుధవారం పార్టీకి రాజీనామా చేశారు.
బీఎస్పీకి చేదు అనుభవం
మొదటిసారి అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీకి నామినేషన్ల పర్వంలో చేదు అనుభవం ఎదురైంది. 8 మంది అభ్యర్థుల నామినేషన్ల రిజెక్ట్ కాగా.. కొందరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మునుగోడు బీఎస్పీ పార్టీ అభ్యర్థి ఆందోజు శంకరాచారి, ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి ఉయిక ఇందిరా పోటీ నుంచి తప్పుకున్నారు. మరోవైపు బీజేపీ రెబల్స్ సైతం పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు వెనక్కి తీసుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 15 స్థానాలకు 20 మంది అభ్యర్థులు ఉపసంహరించుకోగా.. 312 మంది బరిలో ఉన్నారు. మల్కాజిగిరి స్థానంలో అత్యధికంగా 33 మంది పోటీలో ఉండగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అత్యల్పంగా 15 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా 105 నామినేషన్లు దాఖలైన మేడ్చల్ లో చివరకు 22 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. కూకట్ పల్లిలో 24 మంది, ఉప్పల్ లో 32 మంది పోటీ పడుతున్నారు.
ఎల్బీనగర్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ గౌడ్, బీజేపీ నుంచి సామ రంగారెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. ఇక్కడ కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ఉండడం, క్యాండిడేట్బీసీ కావడం.. ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలు.