మా ‘కోర్ లీడర్’.. జిన్పింగే.. చైనా కమ్యూనిస్టు పార్టీ కీలక నిర్ణయం

మా ‘కోర్ లీడర్’.. జిన్పింగే.. చైనా కమ్యూనిస్టు పార్టీ కీలక నిర్ణయం
  • ప్లీనరీలో ఐదేండ్ల ప్రణాళికకు ఆమోదం
  •     సైన్యంలో భారీ మార్పులకూ ఓకే 


బీజింగ్‌: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన ప్లీనరీ సమావేశంలో జిన్‌పింగ్‌ను పార్టీ  ‘కోర్​ లీడర్’గా మరోసారి ఎంపిక చేసింది. పార్టీ, సైన్యంలో ఆయన మాటే ఫైనల్​ అని పేర్కొంది. అదే సమయంలో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్న సైనికాధికారుల్లో భారీ మార్పులు చేపట్టే అంశంపై పూర్తి మద్దతు ఇస్తున్నట్టు పేర్కొంది.

 సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ప్లీనరీలో దేశీయ మార్కెట్‌ను బలపరచడం, సాంకేతిక రంగంలో సాధించాల్సిన లక్ష్యాలపై రూపొందించిన 2026–2030 నూతన ఐదేండ్ల ప్రణాళికకు ఆమోదం తెలిపింది. “పార్టీ, సైన్యం, అన్ని వర్గాల ప్రజలు జిన్‌పింగ్ కు సహకరించేందుకు  ఏకతాటిపైకి రావాలి” అని తీర్మానం చేసింది. 

ప్లీనరీలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతి, క్రమశిక్షణ ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో  చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్‌ ఉపాధ్యక్షుడు జనరల్ హె వైడాంగ్, మరో ఉన్నతాధికారి మియావో హువాను పార్టీ, సైన్యం నుండి బహిష్కరించారు. అదేవిధంగా సైన్యంలో పనిచేస్తున్న మరో తొమ్మిది మంది ఉన్నతాధికారులనూ తప్పించారు. 

 జిన్‌పింగ్‌ 2012లో కమ్యూనిస్టు పార్టీ అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే సైన్యంలో అవినీతి నిరోధక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత నిర్ణయాలు కూడా అందులో భాగమనే చెబుతున్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రస్తుతం మూడో సారి పదవీలో కొనసాగుతున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో సెతుంగ్ తర్వాత ఈ స్థాయిలో నాయకత్వం కొనసాగిస్తున్న ఏకైక చైనా నేత జిన్‌పింగే కావడం గమనించదగ్గ విషయం.