మూగ జీవాల కోసం ప్రాణాలకు తెగించి

మూగ జీవాల కోసం ప్రాణాలకు తెగించి

ఆపదలో చిక్కుకున్న మూగజీవాలను రక్షించాలంటే గొప్ప మనసు ఉండాలి. తెగింపు కూడా ముఖ్యమే. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న మూగజీవాల్ని రక్షించాలంటే కొన్నిసార్లు ప్రాణాలకు తెగించాల్సి రావొచ్చు. వాటిని రక్షిస్తున్నామని తెలియని అవి, తిరిగి దాడి చేయొచ్చు. అందుకే యానిమల్‌‌ రెస్క్యూయర్స్‌‌ జాబ్​ రిస్క్‌‌తో కూడుకున్నది. మహబూబాబాద్‌‌కు చెందిన మొహమ్మద్‌‌ సుమ పదేళ్లుగా ఈ రిస్కీ పనే చేస్తోంది. యానిమల్‌‌ రెస్క్యూయర్స్‌‌లో ఎక్కువగా మగవాళ్లే ఉంటారు. ఎందుకంటే ఇది ఛాలెంజింగ్​ జాబ్‌‌. కానీ, కొందరు ఆడవాళ్లు కూడా ఈ పనిలో రాణిస్తున్నారు. ఇరవై ఒక్కేళ్ల మొహమ్మద్‌‌ సుమ చిన్నప్పట్నుంచి మూగజీవాల్ని రక్షిస్తోంది. పదకొండేళ్ల వయసులోనే జంతువులను కాపాడేది. సుమ, అమ్మానాన్నలు కూడా ఇలా జంతువుల్ని కాపాడుతుండేవాళ్లు. పేరెంట్స్‌‌ నుంచి వచ్చిన అలవాటు వల్ల సుమకు చిన్నప్పట్నుంచే మూగజీవాలపై ఇష్టం ఏర్పడింది. ఏ జంతువును ఎలా చూసుకోవాలి? ఎలా రక్షించాలి? వంటి విషయాలపై అవగాహన పెంచుకుంది. పదకొండేళ్ల వయసులోనే రకరకాల జీవుల్ని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడింది.
ఏ టైమ్‌‌లో అయినా సరే!
కాలువల్లో, బావుల్లో చాలా జంతువులు  చిక్కుకొని  గాయపడుతుంటాయి. మరికొన్ని పక్షులు గూళ్ల నుంచి పడిపోతాయి. ఇలాంటి వాటన్నింటినీ రక్షించి, కోలుకునేలా చేసి, తిరిగి వాటిని సురక్షితంగా వదిలేయడమే సుమ చేసే పని. పదేళ్లలో ఎన్నో జంతువుల్ని ఆమె రక్షించింది. ఏదైనా జంతువు ఆపదలో ఉందని ఫోన్ వస్తే చాలు.. ఉదయమైనా, రాత్రైనా.. ఏ టైం అయినా సరే అక్కడికి వెళ్లి వాటిని కాపాడుతుంది. కొన్నిసార్లు వాటికి తన దగ్గరే టెంపరరీ షెల్టర్‌‌‌‌ కూడా ఏర్పాటు చేస్తుంది. 
40 అడుగుల బావిలో
ఒకసారి చిన్న నక్క 40 అడుగుల లోతున్న బావిలో పడిపోయింది. స్థానికులు ఎవరూ మెట్లు లేని ఆ బావిలోకి దిగేందుకు సాహసించలేదు. కానీ, సుమ అక్కడికి చేరుకుని ఆ బావిలోకి దిగింది. ఒక తాడు కట్టుకుని, బావిలోకి దిగి ఆ నక్కను బయటకు తీసింది. ప్రాణాలకు తెగించి సుమ ఈ పనిచేసింది.  ఇలా ఎన్నో సందర్భాల్లో రిస్క్‌‌ తీసుకుని పని చేస్తుంది. ‘మా పేరెంట్స్​నే ఆదర్శంగా తీసుకుని ఈ పనిచేస్తున్నా. ఐదో తరగతి నుంచే మూగజీవాల్ని కాపాడుతున్నా. రాత్రిపూట కాల్‌‌వస్తే మానాన్న నాకు తోడుగా ఉంటారు’ అని చెప్పుకొచ్చింది సుమ.