ప్రెగ్నెన్సీ రావడంతోనే యువతి హత్య ..వీడిన సూట్​కేస్​ మర్డర్ మిస్టరీ

ప్రెగ్నెన్సీ రావడంతోనే యువతి హత్య ..వీడిన సూట్​కేస్​ మర్డర్ మిస్టరీ

జీడిమెట్ల, వెలుగు:హైదరాబాద్​ నగరంలో అలజడి రేపిన సూట్​కేసులో యువతి డెడ్​బాడీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. హత్యకు గురైన యువతితో పాటు హత్య చేసిన వ్యక్తిది కూడా నేపాలేనని పోలీసులు గుర్తించారు. కొన్ని రోజులుగా హైదరాబాద్​లో ఇద్దరు సహజీవనం చేయగా.. మహిళకు ప్రెగ్నెన్సీ రావడంతో వారి మధ్య విభేదాలు తలెత్తడం వల్లే ఈ హత్య జరిగినట్టు తెలిసింది. 

బాచుపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ దారుణ ఘటన జరగగా 24 గంటల్లోనే సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హత్యకు పాల్పడిన విజయ్ తోపా(30) అనే యువకుడితోపాటు హత్యకు గురైన తారా బెహరా(33) అనే మహిళను నేపాల్​కు చెందిన వారుగా గుర్తించారు. వీరిద్దరిది నేపాల్​లోని పక్కపక్కన గ్రామాలేనని తెలిసింది. తారా బెహరాకు మరొకరితో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ విజయ్​ తోపాతో కొంత కాలంగా వివాహేతర సంబంధం నడుస్తోంది. విజయ్​తోపా హైదరాబాద్​కు వచ్చి ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో చెఫ్​గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్​లో తారా బెహరాను కూడా నేపాల్​ నుంచి హైదరాబాద్​కు తీసుకొచ్చాడు. 

జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేశాడు. అనంతరం తన మకాంను 40 రోజుల క్రితం భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీకి మార్చాడు. ఇక్కడే ఓ అద్దె రూంలో తారా బెహరాతో సహజీవనం చేస్తూ ఓ ఫాస్ట్​ఫుడ్​సెంటర్​లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెకు ప్రెగ్నెన్సీ రావడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలని ఒకరు, వద్దని మరొకరు గొడవ పడ్డారు. ఈ విషయంలో మే 23న రాత్రి ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. విచక్షణ కోల్పోయిన విజయ్​ తోపా ఆమె మెడకు నైలాన్​ తాడు చుట్టి గొంతు నులిపి చంపేశాడు. 

సూట్​కేసుల షాపులో కెమెరాకు చిక్కి..

తారా బెహరాను హత్య చేసిన అనంతరం ఆమె శవాన్ని మాయం చేయాలని విజయ్​ భావించాడు. ఇందుకోసం బాచుపల్లిలోని ఓ షాప్​లో సూట్​కేస్​ కొనుగోలు చేసి అనంతరం ర్యాపిడో బుక్ ​చేసుకుని ఇంటికి వెళ్లాడు. సూట్​కేస్​లో మహిళ శవాన్ని ప్యాక్​ చేసి బయటికి తీసుకెళ్లాడు.

 బాచుపల్లిలోని రెడ్డీస్ కంపెనీ పక్కన ఖాళీ ప్రదేశంలో పడేశాడు. రెండు వారాలు కావడంతో డెడ్​బాడీ కుళ్లిపోయి స్థానికులకు దుర్వాసన వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు పొక్కింది. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. 

సూట్​కేస్​పై ఉన్న పేరు ఆధారంగా పలు సూట్​కేస్​ దుకాణాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరకు బాచుపల్లిలోని ఓ సూట్​కేస్​ దుకాణంలో విజయ్​ సూట్​కేస్​ కొన్న విషయం బయటపడింది. జూబ్లీ హిల్స్​లో తన బంధువుల వద్ద తలదాచుకున్న విజయ్​తోపాను సెల్​ఫోన్​ సిగ్నిల్స్​ ఆధారంగా గుర్తించి పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు.