
జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు(శనివారం) ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రకటించారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల తమకు గౌరవం ఉందని, అయితే తాము యశ్వంత్ సిన్హాకి మద్దతిస్తామని ఆయన తెలిపారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ తర్వాత ఆయన ఈ కామెంట్ చేశారు. ఢిల్లీ, పంజాబ్ లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 10 మంది రాజ్యసభ సభ్యలున్నారు. అలాగే ఆ పార్టీకి పంజాబ్‌లో 92, ఢిల్లీలో 62, గోవాలో ఇద్దరు సహా మొత్తం 156 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ద్రౌపది ముర్ముకు బీజేడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజూ జనతాదళ్, బహుజన్ సమాజ్ పార్టీ, శిరోమణి అకాలీదళ్, శివసేనలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. రాష్ట్రపతి ఎన్నికలకు సోమవారం(జులై 18న) ఓటింగ్ జరగనుండగా, జులై 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రపతిగా ఎన్నికైన వారు జులై 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు.