తెలంగాణలో అడ్డగోలుగా అబార్షన్ కిట్స్..డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మకాలు

తెలంగాణలో అడ్డగోలుగా అబార్షన్ కిట్స్..డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే  అమ్మకాలు
  • డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్న మెడికల్ షాపులు 
  • అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న మహిళలు 
  • గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి నెలకు పదుల సంఖ్యలో కేసులు 
  • తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేస్తున్నా ఆగని దందా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అబార్షన్ కిట్స్ (గర్భస్రావం మందులు) అమ్మకాలు విచ్చలడివిగా జరుగుతున్నాయి. స్కానింగ్స్‌‌‌‌, డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్‌‌‌‌ ఏవీ లేకుండానే మెడికల్ షాపు నిర్వాహకులు అడ్డగోలుగా వీటిని విక్రయిస్తున్నారు. అర్బన్, రూరల్ అనే తేడా లేకుండా.. గర్భస్రావం మందుల వాడకంపై అవగాహన లేక ఉపయోగిస్తున్న మహిళలు, యువతులు అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.  గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు ఈ సమస్యలతో నెలకు పదుల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. కొన్నిసార్లు ఈ మందుల వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, అక్రమ అమ్మకాలకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు నిరంతరం దాడులు చేపడుతున్నప్పటికీ ఈ మెడికల్ దందా జోరుగా సాగుతూనే ఉన్నది.

నిబంధనలు అతిక్రమించి..

అబార్షన్ కిట్స్‌‌‌‌లోని మిఫెప్రిస్టోన్, మిసోప్రోస్టోల్‌‌‌‌లాంటి  మందులు షెడ్యూల్– హెచ్​కిందకు వస్తాయి. వీటిని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ జారీ చేసిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే విక్రయించాలి. అలాగే, గర్భస్రావం కోసం ఈ మందులను వాడే ముందు క్లినికల్ అసెస్‌‌‌‌మెంట్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తప్పనిసరి చేయాలి. ఈ టెస్టులు గర్భం సాధారణమైనదా లేక ఎక్టోపిక్ గర్భధారణ (గర్భాశయం వెలుపల గర్భం)నా అని నిర్ధారిస్తుంది. అయితే, రాష్ట్రంలోని చాలా మెడికల్ షాపులు ఈ నిబంధనలను పాటించడం లేదు. లైసెన్స్ లేని మెడికల్ షాపులు, అర్హత లేని ఫార్మసిస్టులు ఈ అబార్షన్ కిట్స్ ను ఓవర్- ది -కౌంటర్ (ఓటీసీ) అమ్ముతున్నారు. కొన్ని షాపుల్లో ఈ కిట్స్‌‌‌‌ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు.  రూ. 500 ధర ఉన్న కిట్‌‌‌‌ను రూ. 1000–రూ. 1200కు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. 

సీరియస్ కండిషన్ లో గాంధీ, ఉస్మానియాకు..

అబార్షన్ కిట్స్‌‌‌‌ను సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా వాడితే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. డాక్టర్ల సలహా లేకుండా మిసోప్రోస్టోల్‌‌‌‌లాంటి మందులను వాడటం వల్ల  అధిక రక్తస్రావం, తీవ్ర ఇన్ఫెక్షన్లు, గర్భాశయ సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రధాన ఆసుపత్రులు అయిన గాంధీ, ఉస్మానియాలో నెలలలో పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు వస్తున్నాయంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్య వందల్లోనే ఉంటున్నది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ విషయంలో ఈ అబార్షన్ కిట్స్ పనిచేయవు. డాక్టర్ల సలహా లేకుండా అబార్షన్ కిట్స్ ఉపయోగించడం వల్ల ఫెలోపియన్ ట్యూబ్ పగలడం, ఇంటర్నల్ బ్లీడింగ్, హైపోవోలెమిక్ షాక్‌‌‌‌లాంటి సమస్యలు ప్రాణాంతకం అవుతాయి.

149 మెడికల్ షాపులకు నోటీసులు

అబార్షన్​కిట్స్​అక్రమ విక్రయాలను అరికట్టేందుకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. ఇటీవలే జరిగిన దాడుల్లో 149 మెడికల్ షాపుల్లో అబార్షన్ కిట్స్ ను రూల్స్ కు విరుద్ధంగా అమ్మకాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. మెడికల్ షాపు యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్, 1940 ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ దాడుల్లో అబార్షన్ కిట్స్‌‌‌‌కు సంబంధించి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకపోవడం, ప్రిస్క్రిప్షన్ రిజిస్టర్ నిర్వహించకపోవడం, కొనుగోలు బిల్లులు చూపించకపోవడంలాంటి వాటిని అధికారులు గుర్తించారు. అబార్షన్ కిట్స్‌‌‌‌లాంటి షెడ్యూల్–హెచ్​ మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించడం చట్టవిరుద్ధమని, ఇలాంటి ఉల్లంఘనలు గుర్తిస్తే లైసెన్స్ రద్దు, జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని, రాష్ట్రవ్యాప్తంగా దాడులు కొనసాగుతాయని డీసీఏ అధికారులు తెలిపారు.

ప్రాణాలకే ప్రమాదం 

రిజిస్టర్డ్ డాక్టర్ల సూచన లేకుండా అబార్షన్ కిట్స్ ను వాడటం ప్రాణాలకే ప్రమాదం. అబార్షన్ కిట్స్ ఫెయిల్ అయి సీరియస్ కండిషన్‌‌‌‌లో  గాంధీ హాస్పిటల్‌‌‌‌కు నెలకు పదుల సంఖ్యలో వస్తుంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అబార్షన్ పిల్స్ వాడితే ఫెలోపియన్ ట్యూబ్ పగిలి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి హిమోగ్లోబిన్ స్థాయి తగ్గి ప్రాణాలు వదిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. అబార్షన్ కిట్స్‌‌‌‌ను డాక్టర్ సలహా, అల్ట్రాసౌండ్ టెస్ట్ తర్వాత మాత్రమే వాడాలి.
– డాక్టర్ జానకి, గైనకాలజిస్ట్,  గాంధీ హాస్పిటల్