క్రీడలను మరింత  ప్రోత్సహించాలి: సినీనటి జీవిత

క్రీడలను మరింత  ప్రోత్సహించాలి: సినీనటి జీవిత

జగిత్యాల జిల్లా: క్రీడలను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సినీ నటి జీవిత పిలుపునిచ్చారు. కొడిమ్యాల మండలం కేంద్రంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న 55వ రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ఇవాళ ముగిశాయి. పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి సినీ నటి జీవితను గౌరవ అతిథిగా ఆహ్వానించారు. జిల్లా కలెక్టర్ రవితో కలిసి ఆమె వేడుకలకు హాజరయ్యారు. 

మహిళల విభాగం విజేత మహబూబ్ నగర్.. పురుషుల విభాగంలో వరంగల్  విజయం

మహిళల విభాగం ఫైనల్ మ్యాచ్ లో మహబూబ్ నగర్, రంగారెడ్డి జట్లు తలపడగా చెరి ఏడు పాయింట్లతో మ్యాచ్ టైగా ముగిసింది. రెండోసారి మ్యాచ్ నిర్వహించగా  చెరో రెండు పాయింట్లతో మరోసారి టై గా ముగిసింది. దీంతో మినిమం చేంజ్ పద్ధతిలో మ్యాచ్ నిర్వహించగా మహబూబ్ నగర్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ లో రెండుసార్లు టై చేసుకున్న రంగారెడ్డి జట్టు రన్నరప్ స్థానంలో నిలిచింది. 

పురుషుల విభాగంలో కరీంనగర్, వరంగల్ మధ్య ఫైనల్ పోటీ రసవత్తరంగా సాగింది. కరీంనగర్ జట్టుపై వరంగల్ జట్టు 8-7 పాయింట్లతో విజయం సాధించింది. విజేతలకు జిల్లా కలెక్టర్ రవి, సినీనటి జీవిత బహుమతులు అందించారు. అనంతరం సినీ నటి జీవిత మీడియాతో మాట్లాడారు. పోటీలు చాలా ఉత్సాహంగా జరగడం చూసి తనకు సంతోషం కలిగిందన్నారు. ఈ ఖోఖో పోటీల్లో క్రీడా స్ఫూర్తి వెల్లివిరిసిందని తెలిపారు. 

క్రీడా పోటీలకు హాజరుకమ్మని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సూచించడంతో.. ఆయన సూచన మేరకు వచ్చానని జీవిత చెప్పారు. హైదరాబాద్ నుండి చాలా దూరం వెళ్తున్నానని మొదట అనుకున్నాను కానీ.. ఇక్కడ జరిగిన పోటీలకు హాజరైన తర్వాత.. చాలా సంతోషం కలిగిందని.. మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు బండి సంజయ్ కు ధన్యవాదాలు తెలిపారు.