
- రాష్ట్ర కమిటీలో ఒక్కరికి కూడా దక్కని చోటు
- ఓ ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలున్నా ప్రాధాన్యం కరువు
- శ్రేణుల్లోనూ నిరాశస్థానిక ఎన్నికలపై ప్రభావం
నిర్మల్, వెలుగు: బీజేపీ పార్టీకి ఓ ఎంపీతో పాటు నలుగురు ఎమ్మెల్యేలను అందించిన ఆదిలాబాద్ లోక్ సభ స్థానం పరిధిని ఆ పార్టీ అధిష్టానం పూర్తి నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర కమిటీలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఆదిలాబాద్ లోక్‌సభ సభ్యుడు నగేశ్‌తో పాటు ఎమ్మెల్యేలుగా మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీశ్ బాబు బీజేపీ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాదాపు 50 వేల ఓట్లకుపైగా మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డిపై గెలుపొందారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పాయల్ శంకర్ కూడా జోగు రామన్నపై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ ఇద్దరు కూడా మాజీ మంత్రులను ఓడించారు.
రాష్ట్రంలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి దక్కించుకోగా.. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోనే నలుగురు గెలుపొందారు. కానీ ఇటీవల ఆ పార్టీ ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో ఆదిలాబాద్ లోక్‌సభ పరిధి నుంచి ఏ ఒక్క సీనియర్ నాయకుడికి గానీ, కార్యకర్తకు గానీ పదవి దక్కలేదు. దీంతో ఆ పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఆశాభంగం..
భారీ మెజార్టీతో గెలుపొంది నాటి మంత్రులు, సీనియర్లను ఓడించిన బీజేపీ నేతలు.. భవిష్యత్‌లో తమకు పార్టీ పదవులతో పాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నామినేటెడ్ పదవులు సైతం దక్కుతాయని ఆశిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటివరకు వాళ్లకు ఎలాంటి పదవులు దక్కలేదు. సీనియర్లయిన లోక్‌సభ నిర్మల్నియోజకవర్గ ఇన్చార్జ్ అయ్యన్నగారి భూమయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి, సీనియర్ నేత రావుల మామనాథ్ తదితరులు కనీసం పార్టీ రాష్ట్ర కమిటీ లోనైనా చోటు దక్కుతుందని ఎదురుచూస్తున్నారు. కానీ అధిష్ఠానం వారికి మొండిచేయి చూపింది. కమిటీలో ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడంతో ఆ పార్టీ సీనియర్లు, నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరాశతో ఉన్నారు.
నిరాశలో సీనియర్ నేతలు...
రాష్ట్ర కమిటీలో పదవులపై ఆశలు పెట్టుకున్న నాలుగు నియోజకవర్గాల బీజేపీ సీనియర్ నేతలు ప్రస్తుతం బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కేంద్ర బిందువుగా పేర్కొనే నిర్మల్ నియోజకవర్గంలో ఆ పార్టీ సీనియర్లు పదవుల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏండ్లుగా నుంచి తాము పార్టీ కోసం పని చేస్తూ త్యాగాలు చేశామని.. ఈసారైనా అధిష్టానం తమకు పదవులు ఇస్తుందని భావించామని, కానీ ఇవ్వలేదని పేర్కొంటున్నారు.
పార్టీ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ ఉల్లంఘించకుండా చాలామంది సీనియర్లు బహిరంగంగా నోరు మెదపకపోయినప్పటికీ అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తున్న నేతలకు పదవులు దక్కకపోవడం పట్ల కార్యకర్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.