ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసు

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ శుక్రవారం మరోసారి షోకాజ్ నోటీసు పంపింది. గత నెల 22న కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసు పంపుతూ 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఆ గడువు ఈ నెల 1వ తేదీతో ముగిసినా ఆయన నుంచి సమాధానం రాలేదు. దీంతో ఏఐసీసీ వర్గాలు కోమటిరెడ్డి ఆఫీస్​ను సంప్రదించగా.. ఆయన విదేశీ టూర్​లో ఉండడంతో నోటీసు చేరలేదని తెలిపాయి. దీంతో మరోసారి నోటిస్​ ఇష్యూ చేశారు. 

ఎంపీ కామెంట్స్​పై హైకమాండ్ సీరియస్
మునుగోడు బై పోల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్తకు ఎంపీ ఫోన్ చేసి కోరారు. ఆ ఆడియో వైరల్​ అయింది. ఆస్ట్రేలియా పర్యటనలోనూ వెంకటరెడ్డి అక్కడి వాళ్లతో మాట్లాడుతూ..మునుగోడులో కాంగ్రెస్ గెలవదని, తాను ప్రచారం చేసినా 10 వేల ఓట్లు ఎక్కువ వస్తయి కానీ ఫలితం ఉండదని అన్నారు. ఈ క్లిప్పింగ్​ కూడా అధిష్టానానికి చేరింది. ఈ రెండు ఘటనలపై సీరియస్​ అయిన హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  

రాహుల్​ యాత్రకూ దూరం
రాహుల్ గాంధీ భారత్​ జోడో యాత్ర గత నెల 23 నుంచి రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ యాత్రకు సైతం  కోమటిరెడ్డి దూరంగా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటన పూర్తి చేసుకుని ఈ నెల 2న ఆయన హైదరాబాద్​ వచ్చారు. కానీ రాహుల్ యాత్రలో పాల్గొనలేదు. ఈ నెల 7 వరకు రాష్ట్రంలో యాత్ర కొనసాగనుంది. ఆ లోపు రాహుల్​ను వెంకటరెడ్డి కలుస్తారా, లేదా అన్నది చర్చనీయాశంగా మారింది.