
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తొలిసారి తెలుగు సినిమాలో నటించబోతున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు అక్షయ్ మంగళవారం హైదరాబాద్ వచ్చారు. మోహన్ బాబు, విష్ణు ఆయనకు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా, అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన సీన్స్ చిత్రీకరించనున్నారు. ఆయన ఇందులో శివుడి పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
ఇప్పటికే న్యూజిలాండ్‌లో రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు. ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా సినిమాను విడుదల చేయనున్నారు.