అన్ని రేట్లు పెరిగాయి.. ఎలా బతకాలంటూ..

అన్ని రేట్లు పెరిగాయి.. ఎలా బతకాలంటూ..
  • పెరుగుతున్న రేట్లు.. చాలీచాలని జీతాలు
  • కష్టమవుతున్న కుటుంబ పోషణ.. అప్పులు చేస్తే కానీ ఎల్లని పరిస్థితి
  • వాటిని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలు.. ఆగమవుతున్న కుటుంబాలు

వెలుగు, నెట్​వర్క్: అడ్డూ అదుపులేకుండా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ట్యాక్సులతో సామాన్యుడి బతుకు భారమవుతున్నది. ఏడాది కాలంలో వంట నూనెలు సహా నిత్యావసర వస్తువుల రేట్లన్నీ రెట్టింపయ్యాయి. ఆరునెలలుగా అన్ని రకాల చార్జీలు పెరిగాయి. దీంతో  పేదలు, దిగువ మధ్యతరగతి ఇంటి బడ్జెట్​ తల్లకిందులైంది. 
పొద్దస్తమానం రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్నా ఇల్లు గడవడం కష్టంగా మారుతున్నది. కరోనా తర్వాత ఆర్థికంగా చితికిపోయి అప్పులపాలైన కుటుంబాలు ఆ అప్పులు తీర్చలేక,   కుటుంబ పోషణ భారమై  ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. లోన్‌‌యాప్స్‌‌ లో ఐదు, పదివేల రూపాయలు అప్పు చేసి ఏజెంట్ల సూటిపోటి మాటలు తట్టుకోలేక చనిపోతున్నవాళ్లకూ లెక్కలేదు. రాష్ట్రంలో ఇటీవల సుమారు 12 మంది కేవలం లోన్​యాప్​ అప్పుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
తిండికి కూడా కష్టమైతున్నది
కరోనా తర్వాత బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, కారం, చక్కెర, చాయపత్త ఇలా ఒకటేమిటి అన్నింటి రేట్లు 50 శాతానికి పైగా పెరిగాయి. కొద్దిరోజులుగా కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. కిలో టమాట సెంచరికీ దగ్గర్లో ఉన్నది. ఇతర కూరగాయల్లో ఏది కూడా కిలో రూ.60కి తక్కువ లేదు. రష్యా – ఉక్రెయిన్​ యుద్ధానికి ముందు హోల్ సేల్ షాపుల్లో పొద్దుతిరుగుడు, పల్లి నూనె లీటర్ కు రూ.135 నుంచి145కు దొరికేది. ప్రస్తుతం రూ.200కుపైగా పలుకుతున్నాయి. దీంతో పేద కుటుంబాలకు పూటగడవడం కష్టమవుతున్నది. కరోనాకు ముందు అన్ని రకాల ఇంటి సామాను, పాలు, కరెంట్ బిల్లులు కలిపి నలుగురు సభ్యులున్న సామాన్య కుటుంబానికి రూ. 5 వేల నుంచి 6 వేలు అయ్యే ఖర్చు ఇప్పుడు రూ. 10 వేల నుంచి 12వేలు అవుతున్నది. 
ఇంటి కిరాయి కూడా కలిపితే  రూ. 20 వేలకు చేరుతున్నది. ఇక చదువుకునే పిల్లలు ఉన్న ఇండ్లలో బడి ఫీజులకని, పుస్తకాలకని, బట్టలు కూడా కలిపితే మోయలేని భారం అవుతున్నది. 
ఆరు నెలలుగా పన్నులు, చార్జీల మోత
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతోపాటు పన్నుల భారం జనాన్ని ఉక్కిరి బిక్కిరిచేస్తున్నది. పెట్రోల్​ రేట్లు, కరెంట్​ బిల్లులు ఆగం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరు నెలల్లో కరెంటు బిల్లులు, రిజిస్ట్రేషన్​చార్జీలు, బస్​చార్జీల, ఆర్టీఏ టాక్సులు, లిక్కర్​ రేట్ల పెంపు ద్వారా ప్రజలపై ఏం తక్కువ రూ. 20 వేల కోట్ల భారాన్ని మోపింది. నెలకు రూ.500 కరెంట్​ బిల్లు వచ్చే ఇంటికి మే నెల నుంచి రూ.వెయ్యికి పైగా వస్తున్నది. సామాన్యులు ప్రయాణించే బస్సు చార్జీలనూ సర్కారు వదల్లేదు. ఒక్కో టికెట్​పై రూ.10 నుంచి 30 దాకా పెంచేసింది. టూవీలర్స్​, ఆటోలు మొదలుకొని అన్ని రకాల వాహనాల లైఫ్‌‌ ట్యాక్స్‌‌, క్వార్టర్లీ ట్యాక్స్‌‌, గ్రీన్‌‌ ట్యాక్స్‌‌ను 30శాతం మేర అదనంగా వడ్డిస్తున్నది.

గడిచిన ఎనిమిది నెలల్లో రెండు సార్లు రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు అగ్రికల్చర్​, నాన్​ అగ్రికల్చర్, ఓపెన్​ప్లాట్ల విలువను 25శాతం నుంచి 50శాతం మేర పెంచింది. ఇక మేలో లిక్కర్​ రేట్లను 25శాతం మేర పెంచింది. గతంలో ప్రభుత్వానికి ప్రతిరోజూ సగటున రూ. 80 కోట్ల లిక్కర్‌‌ ఆదాయం రాగా.. ఇప్పుడు ఏకంగా రూ. 105 కోట్లకు పెరిగింది. దీంతో లిక్కర్​కు అలవాటు పడ్డ చాలా మంది దాన్ని కొనే స్థోమత లేక, అలవాటును మానుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 
రోజూవారీ ఖర్చులకు అప్పులు చేస్తున్నరు
ఆలుమగలిద్దరూ కూలినాలి చేసి పొట్టపోసుకొనే ఫ్యామిలీలు, నెలనెలా రూ.20 వేలకు మించి ఆదాయం రాని చిరుద్యోగుల కుటుంబాలు దినదినగండంగా బతుకీడుస్తున్నాయి. ఇంటి అవసరాలు, పిల్లల ఫీజుల కోసం బయట తెలిసినవాళ్ల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నాయి. వాటిని తీర్చేందుకు మరోచోట, ఆపై ఇంకోచోట లోన్లు తేవడం ద్వారా క్రమంగా అప్పుల ఊబిలో కూరుకపోతున్నాయి. ఊళ్లలో అప్పులు దొరుకుడు కష్టమైనప్పుడు ఆన్​లైన్​లోన్​యాప్​లను ఆశ్రయిస్తున్నాయి. ప్రజల ఆర్థిక ఇబ్బందులే పెట్టుబడిగా ఆన్​లైన్​లో వందలు, వేల సంఖ్యలో లోన్​యాప్​లు పుట్టుకొచ్చాయి.

ఇలాంటి మనీ లెండర్స్​హైదరాబాద్, ఢిల్లీ, ముంబై,  బెంగళూర్‌‌‌‌ తదితర సిటీలను కేంద్రంగా చేసుకొని లెక్కలేనన్ని లోన్​యాప్స్​ను నడుపుతున్నారు. లోన్​ తీసుకునేటప్పుడు ఫొటో, ఆధార్​తో పాటు ఇతర ఐడెంటిటీ కార్డులు, కాంటాక్టులు, చెక్కులు తీసుకుంటున్నారు. చాలామంది ఇన్​టైంలో అప్పులు తిరిగి చెల్లించనప్పుడు ఏజెంట్లు రకరకాలుగా వేధిస్తున్నారు. బాకీ పడి తప్పించుకొని తిరుగుతున్నారంటూ బాధితుల ఫ్రెండ్స్​ వాట్సాప్​ నంబర్లకు మెసేజ్​లు​పెడ్తుండడం, మార్ఫింగ్​చేసి న్యూడ్​ఫొటోలు పెడ్తామని బెదిరిస్తుండడంతో భరించలేక ఈమధ్యకాలంలో 12 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఊళ్లలో చిన్నచిన్న అవసరాలకు అప్పు పుట్టక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునేవాళ్లు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వంద మందికి పైగా ఉన్నారు.
ఇల్లు గడువక దివ్యాంగుడి ఆత్మహత్య
కుటుంబ పోషణ భారంగా మారి ఓ దివ్యాంగుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన ఎల్లయ్య (42)కు చిన్నప్పుడే కుడికాలు చచ్చుబడిపోయింది. ఆయనకు భార్య ప్రమీల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో కలిసి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. ఇటీవల అన్ని రేట్లు పెరిగిపోవడంతో కుటుంబ పోషణ  కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులు తీర్చే మార్గం లేక, ఇల్లు గడువక ఎల్లయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం సాయంత్రం పొలానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఎంతకూ రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా.. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఎల్లయ్య కనిపించాడు.వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

పది వేల బాకీ తీర్చే పరిస్థితి లేక..


హైదరాబాద్​ సంతోష్​నగర్​ పరిధిలో ఉన్న సలూద్దీన్​నగర్​కు చెందిన మహ్మద్ ​ఖుద్దూస్ ​పాషా(38) వెల్డింగ్​ షాపు నడిపిస్తుంటాడు. పని సరిగ్గా సాగకపోవడం, కుటుంబం గడవకపోవడంతో రూ. 10 వేలు అప్పు చేశాడు. పైసలిచ్చిన వ్యక్తి అప్పు తీర్చాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో మనస్తాపానికి గురయ్యాడు. బంధువుల దగ్గర చేబదులు కోసం ప్రయత్నించినా  లాభం లేకుండాపోయింది.  అప్పు తీర్చే దారి లేక చనిపోవాలని నిర్ణయించుకొని.. మే 30న భార్యతో విషయం చెప్పి పురుగుల మందు కొన్నాడు. కుర్మల్​గూడ చెరువు దగ్గరకు వెళ్లి ముందుగా పిల్లల నోట్లో పురుగుల మందు పోసి వారిని చెరువులో విసిరేశాడు. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత భార్యభర్తలిద్దరూ అదే మందు తాగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 

లోన్​యాప్​లో అప్పు తీసుకొని..


మంచిర్యాల జిల్లా గోపాల్​వాడకు చెందిన బొల్లు కల్యాణి(30) కుటుంబ అవసరాల కోసం ​లోన్ యాప్​ నుంచి రూ. 30వేల అప్పు తీసుకుంది. అసలు, వడ్డీ కట్టాలంటూ అప్పు ఇచ్చిన సంస్థ ఏజెంట్లు పదే పదే ఆమె నంబర్​కు వాట్సాప్ మెసేజ్​లు పెట్టేవారు. ఆ తర్వాత ఆమె ఫొటోను మార్ఫింగ్​ చేసి న్యూడ్​ఫొటోలను సోషల్​ మీడియాలో పెడ్తామని బెదిరించడంతో  మే16న హెయిర్ డై తాగింది. కోలుకొని ఇంటికి వెళ్లినా వేధింపులు ఆపకపోవడంతో 18న బాత్రూంలో ఉరివేసుకొని చనిపోయింది.


ట్రాక్టర్​ కిస్తీలు కట్టలేక.. 


మెదక్​జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కంటె అర్జున్​(38) వ్యవసాయ పనుల కోసం అప్పు చేసి ట్రాక్టర్​ కొన్నాడు. ఆ అప్పు తీర్చేందుకు భూమి అమ్ముదామని ఇంట్లో చెప్పగా ఒప్పుకోకపోవడంతో గొడవ పెట్టుకున్నాడు. ఫిబ్రవరి 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  
మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్ మండల పరిధిలోని బూరుగుపల్లికి చెందిన గడ్డం సాయిలు (36) అనే రైతు ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకుని సాగు చేశాడు. యాసంగి పంట సాగు పెట్టుబడి ఖర్చుతోపాటు, ట్రాక్టర్​ఫైనాన్స్​కలిపి రూ. 5 లక్షల వరకు అప్పు అయింది. ఇది తీర్చే దారి లేక ఏప్రిల్​16న ఉరేసుకుని చనిపోయాడు. 
కూతురి వైద్యం కోసం అప్పు చేసి..తీర్చలేక సూసైడ్​ 
జయశంకర్​భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లికి చెందిన ఆలోత్​లచ్చునాయక్ (67) బిడ్డ పెండ్లి కోసం అప్పు చేశాడు. పెండ్లి తర్వాత కూతురికి క్యాన్సర్​రావడంతో కుమిలిపోయాడు. ఆమెకు హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​కోసం మళ్లీ అప్పు చేశాడు. మొత్తం రూ. 5 లక్షలకు పైనే కావడం, ఇంకా అప్పు చేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో తీర్చలేనేమోనని మనస్తాపానికి గురై మార్చి 23న సూసైడ్​ చేసుకున్నాడు.  
లోన్​ఇచ్చిన సంస్థ వేధింపులతో...
ఖమ్మంలోని విజయనగర్​కాలనీకి చెందిన కూరాకుల రామారావు(50) లారీ డ్రైవర్​గా పనిచేసి వచ్చిన డబ్బులతో ఓ లారీ కొనుక్కున్నాడు. లాక్​డౌన్​లో లారీ నడపక, పెండింగ్​ఈఎంఐలు కట్టలేకపోయాడు. అప్పు ఇచ్చిన సంస్థ లోన్​ తీర్చాలని ఒత్తిడి చేస్తుండడంతో మార్చి 29న లారీకే ఉరేసుకుని తనువు చాలించాడు.  
రెంట్​ కట్టేందుకు డబ్బు లేక..
కుత్బుల్లాపూర్​ చెరుకుపల్లి కాలనీకి చెందిన కె.రఘువీర్​కుమార్​(25) టెన్నిస్​ కోచ్.  సొంతంగా రూమ్​కిరాయికి తీసుకోగా రెంట్​కట్టేందుకు డబ్బులు లేక దిగులు చెందాడు. ఆర్థిక ఇబ్బందులతో ఫిబ్రవరి 2న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధతో రైలు కింద పడ్డ దంపతులు


హైదరాబాద్​ కుషాయిగూడ పరిధిలోని నేతాజీనగర్ లోని సాయికృష్ణా రెసిడెన్సీలో యాడల కొండయ్య(55), భూలక్ష్మి(49) ఉంటున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు.  కుటుంబ అవసరాల కోసం కొండయ్య అప్పులు చేయగా తీర్చలేకపోయారు. దీంతో దంపతులిద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 2న బొల్లారంలోని కలవరి బ్యారక్స్ రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి సూసైడ్​చేసుకున్నారు.  

ఎన్నో విషాదాలు..

  • హుజూర్​నగర్​కు చెందిన శ్రీకాకుళం మహేశ్​(33 ) కార్ డ్రైవర్ . డ్రైవింగ్​చేయగా వచ్చే డబ్బులతో కుటుంబం గడిచేది కాదు. దీంతో మనస్తాపానికి గురై ఏప్రిల్​10న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 
  • సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ గ్రామానికి చెందిన రుస్తుం పేట భాస్కర్(40) టైలరింగ్ చేసేవాడు. సరిగ్గా పని నడవక కుటుంబం గడవకపోవడంతో మనస్థాపానికి గురై  మార్చి 7న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 
  • హైదరాబాద్​లోని కొంపల్లి శ్రీనివాస్​నగర్​కాలనీకి చెందిన శాంతారావు (43) కూడా డ్రైవరే. వచ్చే సంపాదనతో కుటుంబం గడవకపోవడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. కూతుర్ని తీసుకుని భార్య వెళ్లిపోవడంతో ఏప్రిల్​14న ఉరివేసుకుని చచ్చిపోయాడు. 
  • కరీంనగర్​జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన ఉప్పురి రవి (21) ప్రైవేట్​ఎంప్లాయ్. ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బులు కుటుంబాన్ని పోషించేందుకు సరిపోకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. మే 4న పనికి వెళ్తున్నానని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
  • సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్ గ్రామానికి చెందిన గజ్జె మహేశ్(27) తిరుమలగిరిలో ఉంటూ కూలీ పనికి వెళ్లేవాడు. కూలి పని చేయగా వచ్చే డబ్బులు కుటుంబపోషణకు సరిపోక రూ. 4 లక్షలు అప్పు చేశాడు. అవి తీర్చేదారి లేక ఏప్రిల్​18న శామీర్ పేట పెద్ద చెరువులో దూకి సూసైడ్ ​చేసుకున్నాడు. 

 

ఇవి కూడా చదవండి

గజ్వేల్‌‌లో స్పౌజ్ టీచర్ల ఆవేదన సభ

ప్రతి నెల ఒక రోజు పీహెచ్‌‌సీలోనే నిద్రించాలి

పోలింగ్ స్టేషన్​ పరిశీలనకు సీఈసీ ట్రెక్కింగ్‌‌