అమర రాజా ఇన్​ఫ్రా కంపెనీకి బంగ్లాదేశ్​ నుంచి 130 మిలియన్​ డాలర్ల విలువైన సోలార్​ ప్రాజెక్టు

అమర రాజా ఇన్​ఫ్రా కంపెనీకి బంగ్లాదేశ్​ నుంచి 130 మిలియన్​ డాలర్ల విలువైన సోలార్​ ప్రాజెక్టు

హైదరాబాద్​, వెలుగు: అమర రాజా గ్రూప్​లోని అమర రాజా ఇన్​ఫ్రా కంపెనీకి బంగ్లాదేశ్​ నుంచి 130 మిలియన్​ డాలర్ల విలువైన సోలార్​ ప్రాజెక్టు లభించింది. దీంతో ఇంటర్నేషనల్​ సోలార్ ​మార్కెట్లోకి అడుగుపెట్టినట్లవుతుందని అమర రాజా ఒక స్టేట్​మెంట్లో  తెలిపింది. ఇంజినీరింగ్​, డిజైన్​, సప్లయ్​, ఇన్​స్టలేషన్ పనులను ఈ ప్రాజెక్టు కింద నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. 100 మెగావాట్ల కెపాసిటీతో నెలకొల్పే ఈ సోలార్​పవర్​ ప్లాంట్​కు  ఎగ్జిమ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా నిధులు సమకూరుస్తోందని వెల్లడించింది.  బంగ్లాదేశ్​లోని రూరల్​ పవర్​ కంపెనీ లిమిటెడ్​ నుంచి హైదరాబాద్​కే చెందిన మరో కంపెనీ ప్రీమియర్​ సోలార్​తో కలిసి ఈ కొత్త ఆర్డరు చేజిక్కించుకున్నామని పేర్కొంది.

జమల్​పుర్​ జిల్లాలోని మదర్​గంజ్​ వద్ద 326 ఎకరాల విస్తీర్ణంలో సోలార్​ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని,  తర్వాత ఆపరేషన్​, మెయింట్​నెన్స్​ సేవలను కూడా అందించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇండస్ట్రీలోని పెద్ద కంపెనీలతో పోటీ పడి బంగ్లాదేశ్​ ప్రాజెక్టు దక్కించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నామని అమర రాజా ఇన్​ఫ్రా డైరెక్టర్​ విక్రమాదిత్య గౌరినేని ఈ స్టేట్​మెంట్​లో చెప్పారు.