శాంతి స్థాపనకు తోడ్పడుతం.. అమిత్​ షాకు హామీ ఇచ్చిన కుకీ, మైతీ ప్రతినిధులు

శాంతి స్థాపనకు తోడ్పడుతం.. అమిత్​ షాకు హామీ ఇచ్చిన కుకీ, మైతీ ప్రతినిధులు
  • ఇండియా–మయన్మార్ బార్డర్​లో పర్యటించిన అమిత్​ షా
  • భద్రతా చర్యలపై సమీక్ష

ఇంఫాల్/మోరే: మణిపూర్​లో చెలరేగిన అల్లర్ల కట్టడికి స్వయంగా రంగంలోకి దిగిన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్​షా.. అధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం తొమ్మిది సమావేశాలు నిర్వహించి అధికారులకు కీలక సూచనలు చేశారు. బుధవారం ఉదయం ఆయన ఇండియా–మయన్మార్ బార్డర్​లోని మోరే గ్రామంలో పర్యటించారు. కుకీ తెగకు చెందిన ప్రతినిధులతో భద్రతా చర్యలపై సమీక్షించారు. తర్వాత వేరే కమ్యూనిటీలకు చెందిన ప్రతినిధులతో కూడా మాట్లాడారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు తోడ్పడుతామని, ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతిస్తామని వివిధ తెగల  ప్రతినిధులు ఆయనకు హామీ ఇచ్చారు.

మోరేలోనే ఎక్కువ నష్టం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో మోరేలో అమిత్​ షా సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. తర్వాత కాంగ్​పోక్పి జిల్లాకు చేరుకుని వివిధ తెగల ప్రతినిధులతో అమిత్ షా సమావేశమై అక్కడి పరిస్థితులడిగి తెలుసుకున్నారు. అల్లర్ల టైంలో మోరేలో అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.

కాక్చింగ్ జిల్లాలో మళ్లీ కాల్పులు

సెక్యూరిటీ ఆఫీసర్లు, కుకీ, మైతీ తెగల ప్రతినిధులతో అమిత్​ షా భేటీ అవుతున్నా కొన్ని చోట్ల అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. కాక్చింగ్ జిల్లాలోని సుగ్నులో వేర్పాటువాదులు, భద్రతా దళాల మధ్య మంగళవారం రాత్రి కాల్పులు జరిగినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. సగోల్​మాంగ్​లో జరిగిన దాడిలో కొందరు స్థానికులు గాయపడ్డారు.

మంచిగ కలిసుండేవాళ్లం.. ఇప్పుడు మాటల్లేవు

రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఎప్పటికి ఏర్పడుతాయోనని కుకీ, మైతీ తెగల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జనజీవనం మొత్తం స్తంభించిపోయిందని బాధపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ అమల్లో ఉండటం, ఇంటర్​నెట్ సేవలు నిలిపివేయడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు. రెండు తెగల మధ్య మంచి సంబంధాలుండేవని, వ్యాపారాలు జరిగేవని, అల్లర్ల కారణంగా అన్నీ ఆగిపోయాయని మైతీ తెగకు చెందిన ఓ వ్యక్తి తెలిపాడు. అల్లర్లకు భయపడి కొందరు ఇండ్లు వదిలేసి అడవుల్లోకి వెళ్లిపోయారంటూ కుకీ తెగకు చెందిన మరొకతను చెప్పాడు.