బార్డర్ లో కంచె వేద్దామంటే.. మమతా సర్కార్ భూమి ఇవ్వట్లే: హోంమంత్రి అమిత్ షా

బార్డర్ లో కంచె వేద్దామంటే.. మమతా సర్కార్ భూమి ఇవ్వట్లే: హోంమంత్రి అమిత్ షా
  • బంగ్లాదేశీయులకు ఆమె బార్డర్ ఓపెన్ చేశారు: అమిత్ షా  
  • ముస్లిం ఓటు బ్యాంకు కోసం వక్ఫ్​యాక్ట్ నూ వ్యతిరేకించారు
  • వచ్చే ఏడాది ఆమెగద్దె దిగడం ఖాయం
  • బెంగాల్ ఎన్నికలు ఆ రాష్ట్రంతో పాటు దేశ భద్రతకూ కీలకమే
  • కోల్​కతాలో కేంద్ర మంత్రి స్పీచ్

కోల్ కతా: బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అరికట్టేందుకు బార్డర్​లో ఫెన్సింగ్ వేద్దామని కేంద్రం ప్రయత్నిస్తుంటే.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కారు మాత్రం బీఎస్ఎఫ్​కు భూమిని కేటాయించడంలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఆమె బంగ్లాదేశీయులకు బార్డర్ ఓపెన్ చేశారని మండిపడ్డారు. బుజ్జగింపు రాజకీయాల కోసం ఆపరేషన్ సిందూర్​ను, వక్ఫ్​సవరణ చట్టాన్నీ ఆమె వ్యతిరేకించారని విమర్శించారు. 

ఆదివారం కోల్ కతాలో బీజేపీ విజయ సంకల్ప కార్యకర్తల సమ్మేళనంలో అమిత్ షా మాట్లాడారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఆధ్వర్యంలోని టీఎంసీ సర్కార్ గద్దె దిగడం ఖాయమన్నారు. ఆ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తుకే కాకుండా దేశ భద్రతకు కూడా కీలకమన్నారు. బంగ్లా నుంచి చొరబాట్లకు అడ్డుకట్ట వేయడం బీజేపీ సర్కారుకే సాధ్యమన్నారు.

 రెండు నెలల కిందట ముర్షిదాబాద్ లో జరిగిన మత ఘర్షణల సమయంలో బీఎస్ఎఫ్ బలగాలను మోహరించి ఉంటే హిందువులపై దాడులు ఆగిపోయేవని, కానీ మమత అందుకు ఒప్పుకోకుండా హింస కొనసాగేందుకు కారణమయ్యారని అమిత్ షా ఆరోపించారు. పహల్గాంలో టెర్రరిస్టులు హిందువులను కాల్చిచంపితే స్పందించని మమత.. ఆపరేషన్ సిందూర్​లో పాకిస్తాన్ టెర్రరిస్టులను మన బలగాలు మట్టుబెడితే మాత్రం బాధపడ్డారని విమర్శించారు.

 ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆమె ఆపరేషన్ సిందూర్​ను వ్యతిరేకించారని అన్నారు. ఆపరేషన్ సిందూర్​ను వ్యతిరేకించిన వాళ్లకు వచ్చే ఎన్నికల్లో సిందూరం విలువ తెలిసి వచ్చేలా చేయాలని బెంగాల్ మహిళలకు అమిత్​ షా పిలుపునిచ్చారు.

ఫోరెన్సిక్ ల్యాబ్​ల ఆధునికీకరణ

దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్​లను ఆధునికీకరించేందుకు రూ. 2,080 కోట్లు కేటాయించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్​లను శక్తిమంతం చేయడం ద్వారా కోర్టుల్లో మరింత మెరుగైన న్యాయం అందుతుందన్నారు. ఆదివారం కోల్ కతా శివారులోని రాజర్ హాట్​లో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కొత్త బిల్డింగ్​ను​అమిత్ షా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్​లను ఆధునికీకరిస్తామ ని తెలిపారు. రూ. 200 కోట్లతో కొత్తగా ఫోరెన్సిక్ డేటా సెంటర్​నూ ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లో 9 నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీల ఏర్పాటుకు రూ. 1,300 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.