
- ఏపీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
హాజరైన డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్
హైదరాబాద్, వెలుగు: జమ్మూకాశ్మీర్ బార్డర్‌లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్‌కు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లి తండాలో అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, సత్యకుమార్, సవిత పాల్గొని మురళీ నాయక్ భౌతికకాయానికి నివాళులర్పించారు. మంత్రి నారా లోకేశ్ పాల్గొని పాడె మోశారు.
మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయ్, శ్రీరాం నాయక్‌ను పవన్, మంత్రులు ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రూ. 50 లక్షల పరిహారం, ఐదెకరాల పొలం, 300 గజాల ఇంటి స్థలంతో పాటు కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. కాగా, వ్యక్తిగతంగా మురళీ నాయక్ కుటుంబానికి మరో రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.
జిల్లా కేంద్రంలో విగ్రహం..
జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. కళ్లి తండా పేరును మురళీ నాయక్ తండాగా మార్చాలని సర్పంచ్, గ్రామస్తులు విజ్ఞప్తి చేశారని.. ఆ మేరకు పేరు మారుస్తామని తెలిపారు.
సీఎం చంద్రబాబు నివాళి..
మురళీ నాయక్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. “వీర జవాన్ మురళీ నాయక్‌కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుడు మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం ఇస్తాం. ఐదెకరాల సాగుభూమితో పాటు 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీ నాయక్ నేడు మన మధ్య లేకపోయినా ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుంది” అని ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
పాక్‌కు గుణపాఠం చెప్పాలి: పవన్
పాకిస్తాన్ దుశ్చర్యలకు ఎక్కడో ఒకచోట ముగింపు పలికేలా ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘మన దేశం ఎప్పుడూ యుద్ధం కావాలని కోరుకోలేదు. పొరుగు దేశాల మీద యుద్ధాలు చేసిందీ లేదు. మనల్ని మనం సంరక్షించుకోవడానికి ఇప్పుడు యుద్ధం చేయక తప్పని పరిస్థితి. పాకిస్తానే ఈ పరిస్థితికి కారణం. కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్.. కాల్పుల విరమణ ప్రకటించిన 3 గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘించి తోక జాడించింది” అని మండిపడ్డారు. ‘‘మురళీ నాయక్ 2022లో అగ్నివీర్‌గా విధుల్లో చేరాడు. రైల్వే ఉద్యోగం వచ్చినా కాదనుకుని, దేశం కోసం పని చేయాలని అనుకున్నాడు. ఇంత చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం” అని అన్నారు.