ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ

ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన కరోనా వ్యాక్సిన్లు మిగిలిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 75 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయిస్తున్నారు. కేంద్రం పాలసీ నిబంధనల వల్ల ప్రైవేటు వ్యాక్సిన్లు చాలా వరకు మిగిలిపోతున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని.. అవి వృధా అయ్యేకంటే ప్రభుత్వానికి కేటాయిస్తే.. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. 
వచ్చే జులై నెలలో 17 లక్షల 71 వేల 580 డోసుల వ్యాక్సిన్ ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విరివిగా దొరకుతున్నందున చాలా మంది వ్యాక్సిన్ల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడం లేదని.. అత్యవసరమైన వారు తప్ప చాలా మంది ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్లలోనే వేయించుకుంటున్నారని సీఎం జగన్ వివరించారు. వచ్చే జులై నెలలో కేటాయించిన కోటాను ప్రభుత్వానికి బదలాయించాలని ఆయన కోరారు. ఈనెల 24వ తేదీన రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో చాలా రాష్ట్రాలు ఇదే విషయం ప్రస్తావించాయని సీఎం జగన్ తెలిపారు. వ్యాక్సిన్లు వృధా కాకుండా సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వానికి కేటాయించాలని ఆయన కోరారు.