సీఈఆర్​టీ అధికారులతో త్వరలో యాపిల్​ టీమ్​ భేటీ

సీఈఆర్​టీ అధికారులతో త్వరలో యాపిల్​ టీమ్​ భేటీ

న్యూఢిల్లీ: ఫోన్​ హ్యాక్​ అవుతున్నదంటూ పలువురు ప్రతిపక్ష ఎంపీలకు వార్నింగ్ రావడంపై యాపిల్​కు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై వివరణ ఇవ్వడానికి ఆ కంపెనీ సైబర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌లు ఈ నెలలో సీఈఆర్​టీ అధికారులను కలవనున్నారు. తమ ఐఫోన్‌‌‌‌‌‌‌‌లను కేంద్రం హ్యాక్​ చేయిస్తోందని గత నెలలో అనేక మంది ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఈ మేరకు తమకు యాపిల్​ నుంచి  హెచ్చరిక అందిందని పేర్కొన్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్​మంత్రిత్వశాఖ పరిధిలోకి వచ్చే సీఈఆర్​టీ-–ఇన్ ఈ విషయంలో యాపిల్‌‌‌‌‌‌‌‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. తాము ఇచ్చిన నోటీసుకు యాపిల్ వివరణ ఇవ్వాల్సి ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మీటీ) శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. 

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్​టీ-) యాపిల్ స్థానిక ప్రతినిధులతో సమావేశమైందని, అయితే ఈ సమస్య వారి పరిధికి మించిందని ఆయన అన్నారు. అమెరికా యాపిల్ సైబర్ సెక్యూరిటీ టీమ్​సభ్యులు వచ్చి సీఈఆర్​టీ-ను కలవాలని మంత్రి చెప్పారు. అయితే ఈ నెలలో ఎప్పుడైనా బృందం సీఈఆర్​టీ అధికారులను కలవొచ్చని మంత్రి చెప్పారు. సకాలంలో వీసా దొరికితేనే ఈ నెలలో యాపిల్ సైబర్ సెక్యూరిటీ టీమ్ వస్తుందని మెయిటీ అధికారి ఒకరు తెలిపారు.

 తమ ఐఫోన్‌‌‌‌‌‌‌‌లలో హెచ్చరిక నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న ఎంపీల్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నాయకులు శశి థరూర్, పవన్ ఖేరా, కె. సి. వేణుగోపాల్, సుప్రియా శ్రీనాతే, టి.ఎస్. సింగ్​దేవ్​,  భూపిందర్ ఎస్ హుడా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉన్నారు. శివసేన (యుబిటి) ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా, ఎఐఎంఐఎం ప్రెసిడెంట్​అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సన్నిహితులు కూడా ఈ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను అందుకున్నారు.