
- ఇప్పటికే ఆన్‌లైన్‌లో టెండర్ ప్రక్రియ ప్రారంభించిన మత్స్యశాఖ
- ఈ నెలలో జలాశయాల్లో చేప పిల్లలను వదిలేందుకు ఆఫీసర్ల కసరత్తు
- ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 3,441 చెరువుల్లో 6.22 కోట్ల చేపలు
- రూ.7.44 కోట్ల కేటాయింపు
రాజన్నసిరిసిల్ల,వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్ట్‌లు, చెరువులు, కుంటలు జలకళ సంతరించకున్నాయి. దీంతో వాటిల్లో చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే చేప పిల్లల సరఫరాకు ఆన్‌లైన్ టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఈ నెలలోనే చేప పిల్లలను వదిలేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం ఇప్పటికే రూ.7.44కోట్లు కేటాయించింది.
3,441 చెరువుల్లో 6.22కోట్ల చేప పిల్లలు
ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్ట్‌లు, చెరువులు, కుంటలు నిండడంతో సెప్టెంబర్ రెండో వారంలో చేపల పిల్లలను వదిలేలా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 452 చెరువుల్లో 4 ప్రధాన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిల్లో 1.48 కోట్ల చేప పిల్లలను వదలనున్నారు. ఇందులో మిడ్ మానేరులో 28.68 లక్షలు, ఎగువ మానేరులో 10.50లక్షలు, మల్కపేట రిజర్వాయర్‌లో 7.49లక్షలు, అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 13.69లక్షలు, మిగ తావాటిని చెరువుల్లో వదలనున్నారు. చేప పిల్లల పెంపకం కోసం రూ.1.75 కోట్లు కేటాయించారు.
జగిత్యాల జిల్లాలో 1,016 చెరువులు ఉండగా దాదాపు కోటి చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ కసరత్తు రూ.2.20కోట్లు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలోని 957 చెరువుల్లో 1.59 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనున్నారు. దీని కోసం సుమారు రూ.1.58 కోట్లు కేటాయించనున్నట్లు ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు చెప్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 1,016 చెరువులు, లోయర్‌మానేరు డ్యాంలో మొత్తం కలిపి సుమారు 2.15కోట్ల చేప పిల్లలను వదలనున్నారు. దీనికోసం రూ.2.17 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కాగా ఈసారి రెండు రకాల పిల్లలను వదిలేలా అధికారులు ప్లాన్ చేశారు. ఏడాదంతా నీరు నిల్వ ఉండే ప్రాజెక్టులు, చెరువుల్లో పెద్ద సైజు చేప పిల్లలు, వర్షాలు వచ్చినప్పుడు నిండే చెరువుల్లో చిన్న సైజు చేప పిల్లలను వదలనున్నారు. కట్ల(బొచ్చ) రోహు,(తెల్లరకం), శీలావతి, మోసు, కామన్ కార్ప్, మ్రిగలా రకం చేపలనుపెంచనున్నారు.
టెండర్లకు నోటిఫికేషన్ వచ్చింది
రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి టెండర్ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. త్వరలోనే టెండర్లను పూర్తిచేసి చెరువుల్లోకి చేప పిల్లలను వదిలే ప్రక్రియను ప్రారంభిస్తాం. ప్రధాన ప్రాజెక్ట్‌లతో సహా,అన్ని చెరువుల్లో చేప పిల్లలను వదులుతాం.-సౌజన్య, డీఎఫ్‌వో, రాజన్నసిరిసిల్ల జిల్లా